చలాన్ కట్టమని మెసేజ్ వచ్చిందా? ఆ లింక్‌ను క్లిక్ చేస్తే అంతే సంగతులు!
Fake Traffic Challan Alert: ట్రాఫిక్ చలాన్ పెండింగ్‌లో ఉందంటూ మెసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త! సైబర్ మాయగాళ్ల కొత్త ఎత్తుగడపై పీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్ హెచ్చరిక. లింక్‌లపై క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం.
చలాన్ కట్టమని మెసేజ్ వచ్చిందా? ఆ లింక్‌ను క్లిక్ చేస్తే అంతే సంగతులు!
Fake Traffic Challan Alert: మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పెండింగ్‌లో ఉందని, వెంటనే చెల్లించకపోతే జరిమానా పెరుగుతుందని మీకు ఎస్సెమ్మెస్ (SMS) లేదా వాట్సప్ మెసేజ్ వచ్చిందా? అయితే అప్రమత్తంగా ఉండండి. మీరు క్లిక్ చేసే ఆ ఒక్క లింక్ మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసే ప్రమాదం ఉంది. ఈ తరహా మోసాలపై తాజాగా పీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం వాహనదారులను హెచ్చరించింది.
సైబర్ నేరగాళ్లు నకిలీ ఆర్టీవో (RTO) ఈ-చలాన్ లింక్‌లను సృష్టించి ప్రజలకు పంపిస్తున్నారు. ఆ మెసేజ్‌లలో ఉండే లింక్‌లు చూడటానికి అసలైన వెబ్‌సైట్‌ల లాగే కనిపిస్తాయి. మెసేజ్‌లతో పాటు ఏపీకే (APK) ఫైల్స్ లేదా పీడీఎఫ్ (PDF) ఫైల్స్‌ను పంపిస్తూ వాటిని డౌన్‌లోడ్ చేయమని కోరుతున్నారు. ఒకసారి మీరు ఆ లింక్‌పై క్లిక్ చేసినా లేదా ఏపీకే ఫైల్ ఇన్‌స్టాల్ చేసినా, మీ ఫోన్‌లోకి మాల్‌వేర్ ప్రవేశిస్తుంది. తద్వారా మీ ఓటీపీలు (OTP), బ్యాంక్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఇది అనధికారిక యూపీఐ (UPI) లావాదేవీలకు దారితీస్తుంది.
వాహనదారులు మోసపోకుండా ఉండేందుకు అధికారులు ఈ క్రింది సూచనలు చేశారు.
అధికారిక వెబ్‌సైట్ మాత్రమే: చలాన్ల గురించి సమాచారం వస్తే వెంటనే [echallan.parivahan.gov.in] వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ వాహనం నంబర్‌తో సరిచూసుకోండి.
అపరిచిత లింక్‌లు వద్దు: ఎస్సెమ్మెస్ లేదా వాట్సప్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయకండి.
యాప్స్ ఇన్‌స్టాలేషన్: ఏవైనా యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే కేవలం అధికారిక గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేయండి. వాట్సప్‌లో వచ్చే ఏపీకే ఫైల్స్‌ను ఎట్టిపరిస్థితుల్లో ఇన్‌స్టాల్ చేయవద్దు.
ఓటీపీ షేరింగ్: ఎవరికీ మీ వ్యక్తిగత వివరాలు లేదా ఓటీపీలు తెలపకండి.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు కూడా పెరుగుతున్నాయని, కేవలం అప్రమత్తతతోనే ఇలాంటి సైబర్ దాడుల నుంచి తప్పించుకోగలమని నిపుణులు చెబుతున్నారు.




