WhatsApp vs XChat Comparison: వాట్సాప్‌కు పోటీగా 'ఎక్స్-చాట్' రెడీ.. మార్క్ జుకర్‌బర్గ్‌కు ఇచ్చిపడేసిన ఎలన్ మాస్క్..!
WhatsApp vs XChat Comparison: వాట్సాప్ నకు పోటీగా ఎక్స్ చాట్ రాబోతోంది. ఇందులో ఫీచర్లు అత్యధునికంగా, ఎంతో సేప్టీగా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
WhatsApp vs XChat Comparison
Elon Musk XChat Features: ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మాస్క్ నేతృత్వంలోని ఎక్స్ కార్పొరేషన్ సరికొత్త మెసేజింగ్ యాప్ 'ఎక్స్-చాట్'ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. నేటి కాలంలో గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న వినియోగదారుల కోసం ఎటువంటి ప్రకటనలు, ట్రాకింగ్ లేని సరికొత్త అనుభవాన్ని ఈ యాప్ అందిస్తోంది. నేరుగా పాత ఎక్స్ ఖాతాతో అనుసంధానం కావడమే దీని ప్రత్యేకత.
అసలేమిటి ఎక్స్-చాట్.. ప్రత్యేకతలు ఏంటి..?
మెసేజింగ్ యాప్‌ల ప్రపంచంలో ఇప్పుడు ఒక సంచలనం మొదలైంది. ప్రస్తుతం ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన ఎక్స్-చాట్, ప్రధానంగా వ్యక్తిగత సంభాషణల భద్రతపై దృష్టి సారించింది. వాట్సాప్ వంటి ఇతర యాప్‌ల లోటుపాట్లను సరిచేస్తూ, ఇందులో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సౌకర్యాన్ని కల్పించారు. అంటే, మీ సంభాషణలు మీరు, అవతలి వ్యక్తి తప్ప మరెవరూ చూడలేరు.
ఈ యాప్‌లో వినియోగదారులను ఇబ్బంది పెట్టే ప్రకటనలు ఉండవు. అలాగే యూజర్ ట్రాకింగ్ వంటివి కూడా నిలిపివేశారు. పంపిన మెసేజ్‌లను ఎడిట్ చేసే ఆప్షన్, అందరి కోసం డిలీట్ చేసే సదుపాయం ఇందులో ఉన్నాయి.
అత్యుత్తమ భద్రతా ఫీచర్లు..
ఎక్స్-చాట్‌లో 'డిసప్పియరింగ్ మెసేజెస్' అనే ఫీచర్ ఉంది. దీని ద్వారా మీరు పంపిన సందేశాలు కొంత సమయం తర్వాత ఆటోమేటిక్‌గా కనిపించకుండా పోతాయి. భారీ సైజులో ఉన్న ఫోటోలు, వీడియోలు, ఫైల్‌లను ఎటువంటి నాణ్యత తగ్గకుండా పంపుకోవచ్చు. భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఇందులో 'స్క్రీన్‌షాట్ బ్లాకింగ్' ఫీచర్‌ను కూడా చేర్చారు. దీనివల్ల మీ అనుమతి లేకుండా ఎవరూ మీ చాట్‌ను సేవ్ చేసుకోలేరు.
ఎలా పనిచేస్తుంది?
ప్రస్తుతానికి ఈ యాప్ కేవలం ఆపిల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని ఉపయోగించాలంటే ఐఫోన్‌లో ఐఓఎస్ 26 లేదా అంతకంటే కొత్త వెర్షన్ ఉండాలి. అలాగే ఐప్యాడ్ వినియోగదారులకు ఐప్యాడ్-ఓఎస్ 26 లేదా అంతకంటేపైన ఉన్న వెర్షన్లు అవసరం. పాత వెర్షన్ ఫోన్లు ఉన్నవారు దీనిని ఉపయోగించలేకపోవచ్చు.
యాప్ డౌన్‌లోడ్, వినియోగ విధానం..
మీరు ఐఫోన్ లేదా ఐప్యాడ్ వాడుతున్నట్లయితే, యాప్ స్టోర్‌లోకి వెళ్లి 'ఎక్స్-చాట్' అని సెర్చ్ చేసి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్ అయిన తర్వాత మీ ప్రస్తుత ఎక్స్ ఖాతాతో లాగిన్ అయితే సరిపోతుంది. కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. అదనపు భద్రత కోసం ఒక పిన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.
వాట్సాప్ కంటే మెరుగైనదా?
ప్రైవసీ, సరళమైన అనుభవాన్ని కోరుకునే వారికి ఎక్స్-చాట్ ఒక గొప్ప ప్రత్యామ్నాయం. అయితే, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న వాట్సాప్‌ను ఇది ఎంతవరకు తట్టుకుంటుందనేది వినియోగదారుల ఆదరణపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే ఇది రోజువారీ వాడకంలో ఎంత నమ్మకంగా ఉంటుందో వేచి చూడాలి.




