Apple iPhone Duo: యాపిల్ ఫోల్డబుల్ ఫోన్‌కు సామ్‌సంగ్‌నే దిక్కు.. ధర తెలిస్తే షాక్..

Apple iPhone Duo: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 'ఐఫోన్ డ్యూయో' (iPhone Duo) ను మార్కెట్లోకి తీసుకురావడానికి వేగంగా అడుగులు

G Krishna
Published on: 12 Sept 2026 11:58 AM IST
Apple iPhone Duo
X

Apple iPhone Duo 

Apple iPhone Duo: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 'ఐఫోన్ డ్యూయో' (iPhone Duo) ను మార్కెట్లోకి తీసుకురావడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో దక్షిణ కొరియా దిగ్గజం సామ్‌సంగ్ అత్యంత కీలకమైన భాగస్వామిగా మారింది. ఐఫోన్ డ్యూయోలోని అత్యంత ముఖ్యమైన అంతర్గత మడతపెట్టే డిస్‌ప్లే ప్యానెళ్లను తయారీ చేయడానికి యాపిల్, సామ్‌సంగ్ డిస్‌ప్లే విభాగాలు చేతులు కలిపినట్లు ప్రముఖ లీకర్ ఇన్‌స్టంట్ డిజిటల్ వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే మూడేళ్ల పాటు ఐఫోన్ డ్యూయోతో పాటు తదుపరి వచ్చే ఫోల్డబుల్ మోడళ్లకు కూడా సామ్‌సంగ్ మాత్రమే ఈ ప్రత్యేక డిస్‌ప్లేలను సరఫరా చేయనుంది.


ఒక్కో ప్యానెల్‌కు సుమారు $250

ఈ కొత్త ఫోల్డింగ్ డిస్‌ప్లే కోసం యాపిల్ ఒక్కో ప్యానెల్‌కు సుమారు $250 (భారత కరెన్సీలో రూ. 21,000 పైనే) చెల్లిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఐఫోన్ 18 ప్రో మాక్స్ వంటి ప్రీమియం ఫోన్‌ల స్క్రీన్‌ల కోసం యాపిల్ దాదాపు $70 వరకు మాత్రమే వెచ్చిస్తుంది. దానితో పోలిస్తే ఈ ఇన్నర్ ఫోల్డింగ్ ప్యానెల్ ధర దాదాపు మూడు రెట్లు ఎక్కువ. దీంతో ఈ ఫోన్‌లో అమర్చే అత్యంత ఖరీదైన భాగాలలో ఈ డిస్‌ప్లేనే మొదటి స్థానంలో నిలవనుంది. పైగా ఈ $250 అనేది కేవలం లోపలి ప్రధాన స్క్రీన్ తయారీ వ్యయం మాత్రమేనని, ఫోన్ బయటి డిస్‌ప్లే, అసెంబ్లీ, టెస్టింగ్ ఖర్చులు ఇందులో కలవలేదని టెక్ నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా డిస్‌ప్లేల కోసం ఎల్‌జీ, బీఓఈ వంటి ఇతర సంస్థలపై కూడా ఆధారపడే యాపిల్, ఫోల్డబుల్ స్క్రీన్ విషయంలో మాత్రం సామ్‌సంగ్‌కే మొగ్గు చూపింది. ఎల్‌జీ డిస్‌ప్లే విభాగం వద్ద ఇంకా ఫోల్డింగ్ స్క్రీన్ల తయారీ సామర్థ్యం అందుబాటులోకి రాకపోవడం, బీఓఈ సరఫరా చేసే ప్యానెళ్ల నాణ్యత , విశ్వసనీయతపై యాపిల్‌కు కొన్ని సందేహాలు ఉండటమే దీనికి ప్రధాన కారణం. సామ్‌సంగ్ తన అధునాతన 'M16 OLED' మెటీరియల్‌తో స్క్రీన్ ప్రకాశాన్ని, రంగుల నాణ్యతను పెంచడంతో పాటు బ్యాటరీ వినియోగాన్ని తగ్గిస్తూ, పదే పదే మడతపెట్టినా పాడవని నాణ్యమైన స్క్రీన్‌లను అందిస్తుండటంతో యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది.


ఈ ఫోన్ ప్రారంభ ధర దాదాపు $1,999

ఐఫోన్ డ్యూయో డిస్‌ప్లే నిర్మాణం సాధారణ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ కంటే చాలా కష్టంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ దెబ్బతినకుండా ఉండేందుకు నానో-టెక్స్చర్ పొరతో కలిపి మొత్తం 10 లేయర్లను ఈ స్క్రీన్‌లో అమర్చారు. సామ్‌సంగ్‌తో పాటు దాని భాగస్వామి డౌ ఇన్‌సిస్ రూపొందించిన డ్యూయల్ ఆల్ట్రా థిన్ గ్లాస్ (UTG) పొరలను ఈ స్క్రీన్ రక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతల మధ్య తయారవుతున్న ఈ ఫోన్ ప్రారంభ ధర దాదాపు $1,999 (భారత్‌లో రూ. 2,99,900 వరకు) ఉండే అవకాశముంది. తయారు చేయడానికే ఎక్కువ ఖర్చవుతున్నందున, ఒకవేళ స్క్రీన్ పాడైతే రిపేర్ చేయడానికి దాదాపు $1,000 (సుమారు రూ. 84,000) వరకు అవుతుందని అంచనా. 2026 చివరి నాటికి యాపిల్ 50 లక్షలకు పైగా ఫోల్డబుల్ ఫోన్‌లను విక్రయించి, ఫోల్డబుల్ మార్కెట్‌లో 25 శాతం వాటాను దక్కించుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.