Android God Mode Malware: బిగ్ అలర్ట్.. ఫోన్ నుంచి యాప్‌లు మాయమవుతున్నాయా.. 'గాడ్ మోడ్'తో డేంజర్ లో పడ్డట్టే.?
Android God Mode Malware: ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా.. అయితే, ఈ ప్రమాదం పొంచి ఉందన్నమాట. గాడ్ మోడ్ పేరుతో ఓ మాల్వేర్ ప్రస్తుతం దడ పుట్టిస్తోంది. ఇప్పటి ప్రభుత్వ కూడా దీనిపై ఓ హెచ్చరికను జారీ చేసింది.
Android God Mode Malware: బిగ్ అలర్ట్.. ఫోన్ నుంచి యాప్‌లు మాయమవుతున్నాయా.. 'గాడ్ మోడ్'తో డేంజర్ లో పడ్డట్టే.?
Android God Mode Malware: నేటి డిజిటల్ యుగంలో మన వ్యక్తిగత సమాచారం నుంచి బ్యాంకు ఖాతాల వరకు అన్నీ స్మార్ట్‌ఫోన్లలోనే స్టోర్ చేస్తున్నాం. అయితే, ఒక్క చిన్న పొరపాటు మీ జీవితకాల సంపాదనను ఊడ్చేయగలదు. తాజాగా 'ఆండ్రాయిడ్ గాడ్ మోడ్' అనే ప్రమాదకరమైన మాల్వేర్ పట్ల భారత ప్రభుత్వం అత్యున్నత స్థాయి హెచ్చరికను జారీ చేసింది. ఇది మీ ఫోన్‌ను పూర్తిగా హ్యాకర్ల వశం చేస్తుంది.
ఏమిటీ 'గాడ్ మోడ్' మాల్వేర్?
పేరుకు తగ్గట్టే, 'గాడ్ మోడ్' అంటే అన్ లిమిటెడ్ ఫవర్స్ అని అర్థం. ఈ మాల్వేర్ మీ ఫోన్‌లో ప్రవేశించిన తర్వాత, హ్యాకర్లకు మీ పరికరంపై పూర్తి స్థాయి నియంత్రణను ఇస్తుంది. భారత హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని 'నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్' (NCTAU) ఈ ముప్పు గురించి ఆండ్రాయిడ్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఇది సాధారణ వైరస్ కాదు.. ఇది మీ ఫోన్‌ను ఒక రిమోట్ కంట్రోల్ పరికరంగా మార్చివేస్తుంది.
ఈ సైబర్ దాడి ఎలా జరుగుతుంది?
హ్యాకర్లు సాధారణంగా వాట్సాప్ సందేశాలు లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఈ దాడిని ప్రారంభిస్తారు. ఏదైనా బ్యాంకింగ్ యాప్ అప్‌డేట్ అని లేదా గూగుల్ ప్లే సర్వీసెస్ పేరుతో ఒక ఏపీకే (APK) ఫైల్‌ను పంపి, దానిని డౌన్‌లోడ్ చేసుకోమని వినియోగదారులను నమ్మిస్తారు. వినియోగదారులు ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయగానే, అది 'యాక్సెసిబిలిటీ పర్మిషన్' అడుగుతుంది. ఒక్కసారి ఈ అనుమతి ఇస్తే, మీ ఫోన్ తెరపై జరిగే ప్రతి కదలికను స్కామర్లు చూడగలరు.
మాయమయ్యే యాప్స్.. అకౌంట్ అంతా ఖాళీ..
ఈ మాల్వేర్ లోని అత్యంత ప్రమాదకరమైన అంశం ఏమిటంటే, ఇన్‌స్టాల్ అయిన వెంటనే ఇది ఫోన్ మెనూ నుంచి తన ఐకాన్‌ను కనిపించకుండా చేస్తుంది. దీనివల్ల ఫోన్‌లో ఏ యాప్ ఉందో కనిపెట్టడం, దానిని తొలగించడం వినియోగదారులకు కష్టమవుతుంది. ఇది మీ ప్రమేయం లేకుండానే ఓటీప (OTP)లను చదవగలదు, స్క్రీన్ పై క్లిక్ చేయగలదు. ఇతర అనుమతులను స్వయంగా ఆమోదించుకోగలదు. మీ బ్యాంకింగ్ యాప్ పైన నకిలీ స్క్రీన్‌లను ఉంచి, మీ పాస్‌వర్డ్‌లను దొంగిలిస్తుంది.
జాగ్రత్తలు..
ప్రభుత్వ ఏజెన్సీలు సూచించిన కొన్ని కీలక చిట్కాలు ఓసారి చూద్దాం..
ఎప్పుడూ గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్‌లను డౌన్లోడ్ చేయండి. వాట్సాప్ లేదా తెలియని లింకుల ద్వారా వచ్చే ఏపీకే ఫైల్‌లను పొరపాటున కూడా ఇన్‌స్టాల్ చేయకండి.
సాధారణ యాప్‌లు యాక్సెసిబిలిటీ పర్మిషన్ అడిగితే వెంటనే అనుమానించండి.
కాల్ ఫార్వార్డింగ్ తనిఖీ: మీ ఫోన్ నుంచి ##002# డయల్ చేయడం ద్వారా మీ కాల్ ఫార్వార్డింగ్ సెట్టింగ్‌లను రద్దు చేయవచ్చు.
సేఫ్ మోడ్: మీ ఫోన్ విచిత్రంగా ప్రవర్తిస్తుంటే, దానిని 'సేఫ్ మోడ్'లో రీబూట్ చేసి, అనుమానాస్పద యాప్‌లను తొలగించండి.
బాధితులుగా మారితే ఏం చేయాలి?
మీ ఫోన్ హ్యాక్ అయిందని మీరు భావిస్తే, ఆలస్యం చేయకుండా ఫోన్‌ను 'ఫ్యాక్టరీ రీసెట్' చేయండి. వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి ఫోన్ చేయండి లేదా అధికారిక పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయండి.




