Airtel 5G : ఎయిర్‌టెల్ 5G యూజర్లకు షాక్.. హాట్‌స్పాట్‌పై కొత్త రూల్స్.!
Airtel 5G : భారతదేశపు ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు సంబంధించి రెండు కీలకమైన మార్పులు చేపట్టింది. 2023లో కంపెనీ ఎంతో
airtel-5g
Airtel 5G : భారతదేశపు ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు సంబంధించి రెండు కీలకమైన మార్పులు చేపట్టింది. 2023లో కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్‌ను మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా ఇతర డివైజ్‌లకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలా మంది యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కొద్దిరోజులుగా ఇంటర్నెట్‌లో చర్చ నడుస్తోంది. దీనిపై కంపెనీ నిబంధనలు ఇవేనంటూ కొన్ని స్క్రీన్‌షాట్‌లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కంపెనీ తన వెబ్‌సైట్‌లోని నిబంధనలు , షరతుల పేజీని అధికారికంగా అప్‌డేట్ చేస్తూ హాట్‌స్పాట్ వినియోగంపై పూర్తి స్పష్టతనిచ్చింది.
మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా 5G డేటా షేరింగ్‌పై బ్రేక్
ఎయిర్‌టెల్ తన అప్‌డేట్ చేసిన నిబంధనలలో అపరిమిత 5G డేటా అనేది కేవలం వ్యక్తిగత, వాణిజ్యేతర వినియోగానికి మాత్రమే ఉద్దేశించబడిందని స్పష్టం చేసింది. అంటే ఎయిర్‌టెల్ సిమ్ ఉన్న మొబైల్ పరికరంలో మాత్రమే ఈ అపరిమిత 5G డేటాను ఉచితంగా వాడుకోవడానికి వీలవుతుంది. వినియోగదారులు తమ ఫోన్‌లోని హాట్‌స్పాట్ ఆన్ చేసి ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు లేదా ఇతర ఫోన్‌లకు ఇంటర్నెట్ షేర్ చేస్తే, ఆ డేటా ఉచిత అన్‌లిమిటెడ్ కోటా నుండి కట్ అవ్వదు. అలా షేర్ చేసిన డేటా మొత్తం సదరు కస్టమర్ యొక్క రోజువారీ రెగ్యులర్ 4G లేదా 5G ప్లాన్ పరిమితి నుండే మైనస్ అవుతుంది. అంతేకాకుండా ఈ అపరిమిత ప్లాన్‌కు ప్రతి 30 రోజులకు 300GB ఫెయిర్ యూసేజ్ పాలసీ పరిమితి కూడా వర్తిస్తుందని, కమర్షియల్ బ్రాడ్‌బ్యాండ్‌లా వాడితే కనెక్షన్ నిలిపివేసే హక్కు కూడా కంపెనీకి ఉంటుందని స్పష్టమైంది.
రూ. 549 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కు ఎయిర్‌టెల్ స్వస్తి
మరోవైపు ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ పోర్ట్‌ఫోలియోను మారుస్తూ వినియోగదారులకు అందుబాటులో ఉన్న రూ. 549 ఇండివిడ్యువల్ ప్లాన్‌ను నిశ్శబ్దంగా తొలగించింది. ఈ ప్లాన్ ఇప్పుడు ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్ లేదా ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో ఎక్కడా కనిపించడం లేదు. కంపెనీ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, కొత్తగా పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి ఇప్పుడు ఆప్షన్లు పరిమితమయ్యాయి. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌లో అత్యంత చౌకైన ఎంట్రీ-లెవల్ ప్లాన్‌గా రూ. 449 ఇండివిడ్యువల్ ప్లాన్ మాత్రమే మిగిలి ఉంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు కావాలనుకునే కస్టమర్లు ఇప్పుడు నేరుగా రూ. 699 ఫ్యామిలీ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది, ఇందులో ఒక ప్రైమరీ కనెక్షన్‌తో పాటు ఒక అదనపు యాడ్-ఆన్ సిమ్ ఉచితంగా లభిస్తుంది. మిగిలిన ప్రీమియం పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలలో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు.




