Layoffs: ఐటీ ఉద్యోగులకు ఏఐ వార్నింగ్ ..3 ఏళ్లలో 80% మంది ఇంటికే
ఏఐ (AI) కారణంగా ఐటీ రంగంలో భారీ మార్పులు రానున్నాయి.
Layoffs: ఐటీ ఉద్యోగులకు ఏఐ వార్నింగ్ ..3 ఏళ్లలో 80% మంది ఇంటికే
AI Job Crisis : భారత సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు ఐటీ కారిడార్‌లో ఇప్పుడు ఒకే ఒక్క చర్చ సాగుతోంది.. అదే AI లేఆఫ్స్. కృత్రిమ మేధస్సు వల్ల ఉద్యోగాలు పోతాయని ఇప్పటివరకు విన్నాం, కానీ ఒక టెక్కీ తన అనుభవంతో చెప్పిన లెక్కలు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
నేరుగా ఏఐ ప్రాజెక్టులో పనిచేసి.. బాంబు పేల్చాడు
బెంగళూరుకు చెందిన ఒక టెక్కీ ఇటీవల తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అయితే, అతను కేవలం ఉద్యోగం పోయిందని బాధపడకుండా, రెడ్డిట్ వేదికగా ఐటీ రంగ భవిష్యత్తుపై ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టాడు. అతను స్వయంగా ఒక పెద్ద టెక్ కంపెనీలో AI మైగ్రేషన్ ప్రాజెక్టులో పనిచేశాడు. అంటే.. మనుషులు చేసే పనిని ఏఐతో ఎలా భర్తీ చేయాలనే దానిపైనే అతను రీసెర్చ్ చేశాడు. ఆ అనుభవంతోనే అతను ఈ హెచ్చరిక చేశాడు.
ఆ టెక్కీ చెప్పిన కీలక అంశాలు ఇవే
వచ్చే 1 నుండి 3 ఏళ్లలో సర్వీస్ ఆధారిత కంపెనీల్లో పని చేసే 80 శాతం మంది ఉద్యోగుల అవసరం ఉండదు. వారి పనిని ఏఐ టూల్స్ పూర్తి చేస్తాయి. ఏఐ ఏజెంట్లను నిర్వహించడానికి కేవలం 30 శాతం మంది మానవ వనరులు ఉంటే సరిపోతుందని కంపెనీలు భావిస్తున్నాయి. సదరు టెక్కీ వద్ద రూ. 2 కోట్లు ఉన్నా బెంగళూరులో ఇల్లు కొనలేదట. ఐటీ ఉద్యోగాల్లో భరోసా లేనప్పుడు భారీ ఈఎంఐల భారం మోయడం ఆత్మహత్యతో సమానమని అతను హెచ్చరిస్తున్నాడు.
కంపెనీల మాస్టర్ ప్లాన్ ఏంటి?
లేఆఫ్స్ వెనుక కంపెనీలు రెండు ప్రధాన ప్రయోజనాలను ఆశిస్తున్నాయని సదరు టెక్కీ విశ్లేషించాడు. తాము ఏఐ టెక్నాలజీని వాడుతున్నామని ఇన్వెస్టర్లకు చెప్పుకోవడం ద్వారా షేర్ మార్కెట్లో క్రేజ్ సంపాదించడం. ఎక్కువ జీతాలు తీసుకునే ఉద్యోగులను తీసేసి, తక్కువ మందితో ఆటోమేషన్ ద్వారా పని పూర్తి చేసి ఖర్చులు తగ్గించుకోవడం.
ఐటీ సేవల అంతం?
భారతదేశంలోని ఐటీ రంగం ప్రధానంగా సర్వీస్ బేస్డ్ మోడల్‌పై నడుస్తుంది. క్లయింట్లు కోరుకునే చిన్న చిన్న కోడింగ్ పనులు, టెస్టింగ్, డేటా మేనేజ్మెంట్ వంటి పనులను ఇప్పుడు ఏఐ సెకన్లలో చేస్తోంది. దీంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ నైపుణ్యాలను మార్చుకోకపోతే కష్టకాలం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్ అనుకునేవారు. కానీ ఏఐ పుణ్యమా అని ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. ఈ మార్పును తట్టుకోవాలంటే టెక్కీలు కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా, ఏఐని శాసించే స్థాయికి ఎదగాలి. లేదంటే ఆ టెక్కీ చెప్పినట్టుగా 80 శాతం మందిలో మీరు కూడా ఉండవచ్చు.




