Srikakulam: శాసన మండలి సమావేశాలు సజావుగా సాగలేదు ఎమ్మెల్సీ ఆగ్రహం!

Srikakulam: శాసన మండలి సమావేశాల్లో చర్చ లేకుండా ముగించడంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ నర్తు రామారావు మండిపాటు. డీఎస్సీపై సీబీఐ విచారణకు డిమాండ్.

G.RAMBABU, SOMPET
Published on: 23 Aug 2026 7:44 AM IST
Srikakulam
X

Srikakulam: శాసన మండలి సమావేశాలు సజావుగా సాగలేదు ఎమ్మెల్సీ ఆగ్రహం!

Srikakulam: కవిటి ప్రజా సమస్యలు, నిరుద్యోగుల భవిష్యత్తుపై చర్చించేందుకు అవకాశం లేకుండానే నాలుగు రోజుల శాసన మండలి సమావేశాలు ముగియడం దురదృష్టకరమని శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. కవిటి మండలం కొత్తపుట్టుగలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

2025 డీఎస్సీపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. డీఎస్సీ పరీక్షను ప్రభుత్వం సక్రమంగా నిర్వహించి ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. డీఎస్సీపై మండలిలో చర్చకు అవకాశం కల్పించాలని కోరినా ప్రభుత్వం నాలుగు రోజుల పాటు తప్పించుకునే ధోరణి ప్రదర్శించిందని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వైసీపీ పట్టుబట్టినా ప్రభుత్వం స్పందించలేదన్నారు.

రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ సమస్యలను శాసన మండలి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినా సమావేశాలు సజావుగా సాగలేదని తెలిపారు. అందువల్ల ప్రజా సమస్యలను మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నామని చెప్పారు.

బాహుదా వంతెన నిర్మాణం ఏదీ?

రాష్ట్రానికి ముఖద్వారంగా ఉన్న ఇచ్చాపురం పట్టణానికి ప్రవేశ వంతెన కూలిపోయి మూడేళ్లు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని రామారావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బాహుదా నదిపై వంతెన నిర్మాణానికి తీసుకొచ్చిన జీవోను రద్దు చేయడం తప్ప కూటమి ప్రభుత్వం రెండేళ్లలో కొత్త వంతెన నిర్మాణానికి చేసిందేమీ లేదని విమర్శించారు.

ఉద్దానంలో వైద్యుల కొరత

కిడ్నీ వ్యాధులు అనగానే ముందుగా గుర్తుకొచ్చే ఉద్దానం ప్రాంత ప్రజల ఆరోగ్య పరిస్థితులను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించాలని కోరారు. ఉద్దానాన్ని వైద్యపరమైన అత్యవసర ప్రాంతంగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంతంలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో వైద్యుల కొరత తీవ్రంగా ఉందని, ఈ సమస్యను పలుమార్లు శాసన మండలి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పరిష్కారం చూపలేదని తెలిపారు.

దామోదరపురానికి రహదారి ఎప్పుడు?

సోంపేట మండలం దామోదరపురం గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రహదారి కోసం గ్రామస్థులు ఎన్నోసార్లు ఆందోళనలు చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల ఏడు నెలల గర్భిణి అధ్వాన రహదారిపై ప్రయాణించాల్సి రావడంతో ముందస్తు ప్రసవం జరిగి గర్భంలోనే శిశువు మృతి చెందిన ఘటనను ప్రస్తావించారు.

వివాహం జరిగి ఎన్నో సంవత్సరాల తర్వాత కలిగిన సంతానాన్ని కోల్పోయిన ఆ కుటుంబం రోదన, ఆ తల్లి ఆవేదనను ప్రభుత్వం తీర్చగలదా అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు దామోదరపురం గ్రామానికి రహదారి కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు.

ఫిట్‌నెస్‌ పరీక్షలకు వందల కిలోమీటర్ల ప్రయాణం

ఇచ్చాపురం నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షల కోసం వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఆటోలు, బస్సులు, ట్రాక్టర్లు, లారీలు సహా వేలాది ప్రైవేటు వాహనాల యజమానులు ఫిట్‌నెస్‌ కోసం దూరప్రాంతాలకు వెళ్లడంతో అదనపు ఖర్చుతో పాటు రోజుల తరబడి సమయం వృథా అవుతోందన్నారు. ఒకవైపు వాహనాల ప్రయాణానికి నిబంధనలు ఉన్నప్పటికీ ఫిట్‌నెస్‌ పరీక్షల కోసం వందల కిలోమీటర్లు వెళ్లాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందన్నారు.

ఈ క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇలాంటి ప్రధాన సమస్యలపై శాసన మండలిలో చర్చించి పరిష్కారం చూపించాల్సిన ప్రభుత్వం సమావేశాలను సజావుగా నిర్వహించడంలో విఫలమైందని ఎమ్మెల్సీ నర్తు రామారావు విమర్శించారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story