Srikakulam: డీజే సౌండ్లకు బదులు భక్తిభావంతో వేడుకలు జరుపుకోవాలి: కేంద్ర మంత్రి!
Srikakulam: దేశ, రాష్ట్ర ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
Srikakulam: డీజే సౌండ్లకు బదులు భక్తిభావంతో వేడుకలు జరుపుకోవాలి: కేంద్ర మంత్రి!
శ్రీకాకుళం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గణపయ్య ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు చేకూరాలని కోరారు. ఆ భరోసాతో సమాజం, రాష్ట్రం, దేశ అభివృద్ధి వైపు మనమంతా బలమైన అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని కేంద్ర మంత్రి కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టించి పర్యావరణ హితమైన వస్తువులతో పండుగను నిర్వహించాలని సూచించారు.
వినాయక చవితి వేడుకల్లో అనవసర ఆర్భాటాలకు, అధిక శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండాలని కోరారు. డీజే సౌండ్లకు బదులుగా భక్తిభావంతో, ప్రశాంతమైన వాతావరణంలో గణనాథుడిని పూజించుకోవాలని సూచించారు. భక్తి, సంప్రదాయం, పర్యావరణ పరిరక్షణ.. ఈ మూడింటినీ కలిపి వినాయక చవితిని ఆదర్శవంతంగా జరుపుకుందామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.




