Ichchapuram: ఇచ్చాపురంలో తెదేపా కార్యకర్త హల్‌చల్!
Ichchapuram: ఇచ్చాపురం 9వ వార్డు సచివాలయంలో తెదేపా కార్యకర్త రాహుల్ కుమార్ సాహు అధికారిక కుర్చీలో కూర్చొని పెన్షన్ దరఖాస్తులను పరిశీలించిన ఘటన కలకలం రేపింది.
Ichchapuram: ఇచ్చాపురంలో తెదేపా కార్యకర్త హల్‌చల్!
Ichchapuram: ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ జోక్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు (స్వర్ణ వార్డు) సచివాలయంలో ఓ తెదేపా కార్యకర్త అధికారిక కుర్చీలో కూర్చొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తులను పరిశీలించిన ఘటన చర్చనీయాంశంగా మారింది.
తెదేపా కార్యకర్తగా పేర్కొంటున్న రాహుల్ కుమార్ సాహు పసుపు రంగు టీషర్టు ధరించి సచివాలయంలోని అధికారిక కుర్చీలో కూర్చొని పెన్షన్ దరఖాస్తులను వెరిఫికేషన్ చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అనంతరం పరిశీలించిన దరఖాస్తులను సచివాలయ సిబ్బందికి అందజేస్తూ తాను పరిశీలించి ఆమోదించిన దరఖాస్తులను మాత్రమే డేటా ఎంట్రీ చేయాలని సూచించినట్లు చెబుతున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి, అర్హతను నిర్ధారించే బాధ్యత అధికార యంత్రాంగానిదే. అలాంటిది ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులో ఉండగానే ఓ రాజకీయ పార్టీ కార్యకర్త దరఖాస్తులను పరిశీలించడం, సిబ్బందికి సూచనలు చేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సచివాలయాల్లో ప్రజలకు సేవలందించే ప్రక్రియ పారదర్శకంగా సాగాల్సి ఉండగా రాజకీయ కార్యకర్తలు అధికారిక విధుల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు రావడం అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందడంలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదని స్థానికులు పేర్కొంటున్నారు.
సచివాలయంలో జరిగిన ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అనధికార వ్యక్తుల జోక్యాన్ని అరికట్టి, నిబంధనలకు అనుగుణంగా సంక్షేమ పథకాల అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




