Srikakulam: వెన్నెలవలస ఆశ్రమ పాఠశాలలో ఘనంగా మెగా పీటీఎం
Srikakulam: సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో మెగా పీటీఎంలో పాల్గొన్న ఎమ్మెల్యే కూన రవికుమార్. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం.
Srikakulam: వెన్నెలవలస ఆశ్రమ పాఠశాలలో ఘనంగా మెగా పీటీఎం
శ్రీకాకుళం: రాష్ట్రంలో ప్రతీ పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, 'తల్లికి వందనం' పథకం ప్రతి కుటుంబానికి కొండంత భరోసానిస్తోందని ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్i స్పష్టం చేశారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన మెగా తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల (4.0) సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేస్తున్నట్లు వివరించారు. గిరిజన, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పట్టణ ప్రాంత పిల్లలతో సమానంగా అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మౌలిక వసతులు, డిజిటల్ విద్యను సమర్థవంతంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో తల్లిదండ్రులు తొలి గురువులని, తరచూ పాఠశాల సమావేశాలకు హాజరవుతూ ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించి అభినందించారు. సమావేశం అనంతరం తరగతి గదులు, వసతి గృహం, భోజనశాలను పరిశీలించి విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
వసతులపై అధికారులను ఆరా తీసి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలిపిన విన్నపాలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.




