Srikakulam: చంద్రబాబు అరెస్ట్ చీకటి రోజు - మంత్రి అచ్చెన్నాయుడు

Srikakulam: చంద్రబాబు అరెస్ట్ తెలుగుజాతి చరిత్రలో చీకటి రోజని, కక్షసాధింపు రాజకీయాలే వైసీపీ పతనానికి నాంది పలికాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 9 Sept 2026 7:47 PM IST
Srikakulam
X

Srikakulam: చంద్రబాబు అరెస్ట్ చీకటి రోజు - మంత్రి అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం: సెప్టెంబర్ 9వ తేదీ తెలుగుజాతి చరిత్రలో ఎన్నటికీ మరచిపోలేని చీకటి రోజుగా మిగిలిపోతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మూడేళ్ల క్రితం అప్పటి వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపుతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసులు నమోదు చేసి నిర్బంధించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేసిందని విమర్శించారు.

చంద్రబాబు నాయుడిని జైలుకు పంపడం ద్వారా ఆయన గొంతును అణచివేయవచ్చని, టీడీపీని బలహీనపరచవచ్చని వైసీపీ పాలకులు భావించారని అన్నారు. అయితే చంద్రబాబును జైలులో పెట్టగలిగారు కానీ ప్రజల గుండెల్లో ఆయనపై ఉన్న విశ్వాసాన్ని మాత్రం బంధించలేకపోయారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

చంద్రబాబుపై జరిగిన రాజకీయ కక్షసాధింపునకు వ్యతిరేకంగా యావత్ తెలుగుజాతి ఏకమై నిలిచిందని మంత్రి తెలిపారు. దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు సైతం చంద్రబాబుకు అండగా నిలిచి తమ సంఘీభావాన్ని చాటారని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు, కేసులు, నిర్బంధాలు ఎదురైనా చంద్రబాబు ప్రజల పక్షాన నిలిచి పోరాడారని అన్నారు.

చంద్రబాబుపై పన్నిన రాజకీయ కుట్రలే చివరకు వైసీపీ పతనానికి నాంది పలికాయని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజల తీర్పు ముందు అధికార అహంకారం, కక్షసాధింపు రాజకీయాలు నిలబడలేవని రాష్ట్ర ప్రజలు ఎన్నికల తీర్పుతో స్పష్టం చేశారని తెలిపారు.

చంద్రబాబు నిర్బంధ సమయంలో ఆయనకు అండగా నిలిచిన ప్రతి తెలుగు కుటుంబం, ప్రతి టీడీపీ కార్యకర్త, ప్రతి అభిమాని చూపిన పోరాట స్ఫూర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మంత్రి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు సాగించిన సుదీర్ఘ పోరాటానికి ప్రజలే ప్రత్యక్ష సాక్షులని పేర్కొన్నారు.

నేడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి కల్పన దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.

చంద్రబాబు నాయుడి సేవలు, ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చూపిన దూరదృష్టి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాజకీయ కక్షసాధింపులు తాత్కాలికమేనని.. ప్రజల విశ్వాసం, ప్రజాస్వామ్య విలువలు, సత్యం ఎప్పటికీ విజయం సాధిస్తాయని అన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story