Srikakulam: ఏపీ తొలి ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్ విజేత ఎల్. హరిప్రియ
Srikakulam: ఆంధ్రప్రదేశ్ తొలి రాష్ట్ర ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్-2026లో శ్రీకాకుళం జిల్లా కవిటి మండలానికి చెందిన ఎల్. హరిప్రియ మహిళల విభాగంలో రాష్ట్ర చాంపియన్‌గా నిలిచింది.
Srikakulam: ఏపీ తొలి ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్ విజేత ఎల్. హరిప్రియ
శ్రీకాకుళం: కవిటి/శ్రీకాకుళం నెల్లూరు జిల్లా క్యారమ్ సంఘం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యారమ్ సంఘం పర్యవేక్షణలో మూడు రోజులపాటు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ తొలి రాష్ట్ర ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్–2026 ఆదివారం ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా కవిటి మండలానికి చెందిన ఎల్. హరిప్రియ మహిళల విభాగంలో రాష్ట్ర చాంపియన్‌గా నిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యారమ్ జట్టుకు ఎంపిక కావడం ద్వారా జిల్లాకు మరో క్రీడా గౌరవాన్ని తీసుకొచ్చింది.
నెల్లూరు క్లబ్ ప్రాంగణంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి సరయూ హీరో మేనేజింగ్ డైరెక్టర్ ఎ. రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం టోర్నమెంట్ కో-చైర్మన్, మాజీ రంజీ క్రికెటర్ మలిరెడ్డి కోటారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యారమ్ జట్టును అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా మలిరెడ్డి కోటారెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర సాధన అవసరమని పేర్కొన్నారు. యువ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.
మహిళల విభాగంలో ఎల్. హరిప్రియ ప్రథమ స్థానం సాధించగా, తిరుపతికి చెందిన బి. శోభిక ద్వితీయ స్థానం, విశాఖపట్నానికి చెందిన ఎం.ఎస్.కె. హారిక తృతీయ స్థానం దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా క్యారమ్ సంఘం కార్యదర్శి పూడి నేతాజీ హరిప్రియను అభినందిస్తూ, ఆమె విజయం జిల్లా క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జిల్లాలో క్యారమ్ క్రీడాభివృద్ధికి సంఘం కృషి చేస్తోందని, గ్రామీణ ప్రాంతాల నుంచి మరింత మంది ప్రతిభావంతులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. హరిప్రియ జాతీయ స్థాయిలోనూ రాణించి జిల్లాకు, రాష్ట్రానికి మరిన్ని విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో బి.వి. శేషారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, షేక్ అబ్దుల్ జలీల్, మన్నారాయణ, పి. శ్రీనివాసులు, రాష్ట్ర, జిల్లా క్యారమ్ సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, అధికారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.




