Garugubilli: హెల్మెట్ లేని వారికి పోలీసుల వినూత్న అవగాహన
Garugubilli: రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు కృత్రిమ యాక్సిడెంట్ స్పాట్ ఏర్పాటు చేశారు.
Garugubilli
Garugubilli: ఎర్రన్న గుడి జంక్షన్ వద్ద పోలీసుల వినూత్న ప్రయోగం. అతివేగం, హెల్మెట్ నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో చూపించేందుకు ఎస్సై ఫకృద్దీన్ ఆధ్వర్యంలో కృత్రిమ యాక్సిడెంట్ స్పాట్ ఏర్పాటు చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండల కేంద్రంలోని ఎర్రన్న గుడి జంక్షన్ వద్ద సోమవారం ఎస్సై ఫకృద్దీన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు, మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్ల సంభవించే రోడ్డు ప్రమాదాల తీవ్రతను ప్రజలకు వివరించేందుకు పోలీసులు కృత్రిమ ప్రమాద స్థలాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న పలువురు వాహనదారులను ఆపి, రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే పర్యవసానాలు, కుటుంబాలకు జరిగే నష్టాన్ని ప్రత్యక్షంగా వివరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై ఫకృద్దీన్ సూచించారు.
అంతేకాకుండా మాదకద్రవ్యాల అమ్మకాలు, రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా కలిగే దుష్ప్రభావాలను ఆయన వివరించారు.




