Srikakulam: మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో 356 మందికి హాస్టల్ సీట్లు!

Srikakulam: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజన్ పరిధిలోని 12 బీసీ వసతి గృహాల్లో 356 మంది విద్యార్థులకు కొత్తగా ప్రవేశాలు కల్పించారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Updated on: 31 Aug 2026 5:36 PM IST
Srikakulam
X

Srikakulam: మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో 356 మందికి హాస్టల్ సీట్లు!

శ్రీకాకుళం కోటబొమ్మాళి: పేద, మధ్యతరగతి బీసీ విద్యార్థుల విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం అందించడంతో పాటు, వారికి నాణ్యమైన వసతి, విద్యా సౌకర్యాలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో టెక్కలి డివిజన్ పరిధిలోని 12 బీసీ వసతి గృహాల్లో 2026-2027 విద్యా విద్యా సంవత్సరానికి 356 మంది విద్యార్థిని, విద్యార్థులకు నూతనంగా ప్రవేశాలు కల్పించారు.

సోమవారం నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బీసీ వసతి గృహాల అడ్వైజరీ కమిటీ చైర్మన్, రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టెక్కలి డివిజన్ పరిధిలోని బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలపై సమీక్షించి, అర్హులైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ఆమోదం తెలిపారు.

ఈ నిర్ణయంతో మొత్తం 356 మంది విద్యార్థులకు హాస్టల్‌లో కొత్తగా ప్రవేశాలు లభించాయి. వీరిలో 120 మంది బాలికలు, 236 మంది బాలురు ఉన్నారు. దీంతో గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు తమ స్వగ్రామాలకు దూరంగా చదువుకునే సమయంలో వసతి, భోజనం తదితర సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి, వారి చదువుకు ఆర్థిక భారం తగ్గే అవకాశం కలుగుతుంది.

విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని, పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బీసీ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు, సురక్షితమైన వసతి, అవసరమైన మౌలిక సదుపాయాలు అందేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వాటికి తక్షణ పరిష్కారం చూపాలని సూచించారు.

బీసీ విద్యార్థులకు విద్యా అవకాశాలను విస్తరించడం ద్వారా వారి ఉన్నత విద్యకు, భవిష్యత్‌లో మెరుగైన ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం బాటలు వేస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం, వారి ఉజ్వల భవిష్యత్తే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని మంత్రి స్పష్టం చేశారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story