Kaviti: కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ నర్తు రామారావు ధ్వజం

Kaviti: కవిటిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

G.RAMBABU, SOMPET
Published on: 24 Aug 2026 5:49 PM IST
Kaviti
X

Kaviti: కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ నర్తు రామారావు ధ్వజం

కవిటి: కవిటి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్ష నాయకులపై కేసులు, అరెస్టులు, బెదిరింపులకు పాల్పడుతోందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులను అణచివేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు.

గత ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు అదనంగా సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తామని కూటమి నేతలు ప్రజలకు హామీలు ఇచ్చారని నర్తు రామారావు గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం.. ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితిలో ఉందన్నారు.

తమ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, మాజీ మంత్రులపై కేసులు, అరెస్టులతో భయాందోళనలు సృష్టించడం సరికాదన్నారు. మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడికి జరిగిన రోడ్డు ప్రమాదం వ్యవహారంలో మాజీ మంత్రి అప్పలరాజును కూడా అరెస్టు చేయడంపై ఆయన ప్రశ్నలు సంధించారు. అలాగే బీసీ నాయకుడు, మాజీ మంత్రి తణుకు కనుమూరి నాగేశ్వరరావు పై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్షతోనే కేసులు పెడుతున్నారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లోకి వెళ్లి చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వానికి ఏమీ లేకపోవడంతోనే కేసులు, అరెస్టులు, బెదిరింపులను ఆశ్రయిస్తోందని నర్తు రామారావు విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమన్నారు. ప్రజాస్వామ్య పాలనకు బదులు రౌడీ రాజ్యాన్ని తలపించేలా పాలన సాగుతోందని తీవ్రంగా ధ్వజమెత్తారు.

ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున ప్రశ్నించే తమ గొంతును అణచివేయలేరని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే కూటమి ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని నర్తు రామారావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తనయుడు నర్తు శివాజీ తదితర నాయకులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story