Kanchili: గుంతలమయంగా మకరాంపురం రోడ్డు - ఆలయ ధర్మకర్త చొరవ
Kanchili: కంచిలి మండలం మకరాంపురం వద్ద రహదారి గుంతలమయంగా మారడంతో షిర్డీ సాయి ఆలయ ధర్మకర్త బెందాళం రమణస్వామి చొరవతో జేసీబీ, కంకరతో రోడ్డు మరమ్మతులు పూర్తి.
Kanchili: గుంతలమయంగా మకరాంపురం రోడ్డు - ఆలయ ధర్మకర్త చొరవ
కంచిలి: కంచిలి మండలం మకరాంపురం పంచాయతీ పరిధిలోని మకరాంపురం – కవిటి రహదారి గుంతలమయంగా మారింది. ఆదివారం సంత సమీపంలో, మకరాంపురం గుడియా వీధి వద్ద రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ రహదారిపై నిత్యం ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు తదితర వాహనాలతో పాటు పాదచారులు రాకపోకలు సాగిస్తుంటారు. గుంతలను తప్పించుకునే క్రమంలో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. వర్షాలు కురిసినప్పుడు గుంతల్లో నీరు చేరడంతో అవి కనిపించకపోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది.
గుంతలు కనిపిస్తున్నా.. స్పందన కరువు
రహదారి దుస్థితిపై సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులకు తెలిసినా ఇంతవరకు శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంపై గ్రామస్తులు, వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల రాకపోకలకు కీలకమైన ఈ రహదారిపై అధికారులు వెంటనే దృష్టి సారించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ఆలయ ధర్మకర్త చొరవ
ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన మకరాంపురం షిర్డీ సాయి ఆలయ ధర్మకర్త బెందాళం రమణస్వామి చొరవ తీసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో ట్రాక్టర్‌తో సిప్స్ కంకరను తీసుకువచ్చి, జేసీబీ సాయంతో రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో వేసి పూడ్చారు. అనంతరం జేసీబీతో రోడ్డును చదును చేశారు.
గుంతలను పూడ్చి రోడ్డును చదును చేయడంతో తాత్కాలికంగా ఇబ్బందులు తగ్గడంపై గ్రామస్తులు, వాహనచోదకులు హర్షం వ్యక్తం చేశారు.శాశ్వత పరిష్కారం కోసం ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గొండ్యాల వెంకటరమణ, ఎలుసూరి పార్వతీశం, బిరకట రమేష్ తదితరులు పాల్గొన్నారు.




