Ichchapuram: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ సన్నాహక సమావేశాలు
Ichchapuram: ఇచ్ఛాపురంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, డోర్ టూ డోర్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
Ichchapuram: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ సన్నాహక సమావేశాలు
ఇచ్ఛాపురం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం ఇచ్ఛాపురం మున్సిపాలిటీ, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో రెండు విడతలుగా (ఉదయం, సాయంత్రం) విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు.
కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు జరిగిన మోసాలను వివరిస్తూ గ్రామాల్లో, వార్డుల్లో ‘డోర్ టూ డోర్’ ప్రచారం ముమ్మరంగా చేపట్టాలని నిర్ణయించారు. దీనితో పాటు అర్హులైన ప్రతి కార్యకర్తకు పార్టీ గుర్తింపు కార్డుల (ఐడీ కార్డ్స్) పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్టీరింగ్ కమిటీల ఏర్పాటు.. సమిష్టి నిర్ణయంతోనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది అని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగాలని సమావేశంలో తీర్మానించారు.
ఇందుకోసం ప్రతి పంచాయతీ, ఎంపీటీసీ సెగ్మెంట్, మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, స్థానిక శ్రేణుల సమిష్టి నిర్ణయం మేరకే అభ్యర్థులను ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల సమన్వయం కోసం మండలం, మున్సిపాలిటీ స్థాయిల్లో ప్రత్యేక స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేసి కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ నర్తు రామారావు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ, బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్ర యాదవ్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పిలక రాజలక్ష్మి, మాజీ వైస్ చైర్‌పర్సన్ భారతి దివ్య, మాజీ చైర్‌పర్సన్ స్వర్ణమణి, ప్రకాష్ రావు పట్నాయక్, ఎంపీపీ బోర పుష్ప, జడ్పీటీసీ నారాయణమ్మ, దువ్వు వివేకానంద, దున్న గురుమూర్తి, ఆశి కృష్ణారెడ్డి, ఆశి పురుషోత్తం రెడ్డితో పాటు వార్డు ఇన్‌చార్జులు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




