Ichchapuram: ఇచ్చాపురంను కరువు ప్రాంతంగా ప్రకటించాలి!

Ichchapuram: వర్షాభావంతో ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎండిపోయిన వరి పొలాలను వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సాడి శ్యాం ప్రసాద్ రెడ్డి పరిశీలించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Aug 2026 1:12 PM IST
Ichchapuram
X

Ichchapuram: ఇచ్చాపురంను కరువు ప్రాంతంగా ప్రకటించాలి!

Ichchapuram: ఇచ్చాపురం వర్షాభావంతో ఖరీఫ్ సాగు సంక్షోభంలో చిక్కుకుపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సాడి శ్యాం ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఇచ్చాపురం మండలం టీ. బరంపురం గ్రామపంచాయతీ పరిధిలో ఎండిపోయిన వరి పొలాలను స్థానిక రైతులు, మండల ఎంపీపీ బోర పుష్పతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన సాడి శ్యాం ప్రసాద్ రెడ్డి, పొలాల్లో మొలకెత్తిన వరి విత్తనాలు వర్షాభావం కారణంగా ఎండిపోవడం అత్యంత ఆందోళనకరమన్నారు. వర్షాల కోసం రోజూ ఆకాశం వైపు ఎదురు చూస్తున్న రైతులు ఆశలు కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకవైపు వర్షాలు పూర్తిగా ముఖం చాటేయగా, మరోవైపు బహుదా నదిపై నిర్మించిన గ్రోయిన్లు సాగునీటి సమస్యకు పరిష్కారం చూపలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దమ్ములు చేసి వరి నాట్లు వేసేందుకు కూడా నీరు అందుబాటులో లేక ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇప్పటికే సాగుకు పెట్టిన పెట్టుబడులు వృథా అవుతాయనే భయంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.

టీ. బరంపురం పంచాయతీలోనే కాకుండా ఇచ్చాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి నియోజకవర్గాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి రైతులకు నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ, సాగునీటి అత్యవసర చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

పరిశీలన కార్యక్రమంలో ఇచ్చాపురం మండల ఎంపీపీ బోర పుష్ప, మండల రైతు విభాగం అధ్యక్షులు కారింగి త్రినాథ్, స్థానిక రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story