Kanchili: వరి సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటించాలి: వ్యవసాయ శాఖ!
Kanchili: కంచిలి ముండల రైతు సేవా కేంద్రంలో ఆత్మ ఆధ్వర్యంలో రైతు శిక్షణ. వరి సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటించాలని వ్యవసాయ అధికారుల పిలుపు.. మట్టి విశ్లేషణ పత్రాల పంపిణీ.
Kanchili: వరి సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటించాలి: వ్యవసాయ శాఖ!
కంచిలి: కంచిలి వరి సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటించి, పంటకు అవసరమైన ఎరువులను సరైన మోతాదులో వినియోగించడంతో పాటు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. కంచిలి మండలం ముండల రైతు సేవా కేంద్రం పరిధిలో ఆత్మ పథకం కింద శుక్రవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ జగన్మోహన్‌రావు మాట్లాడుతూ ప్రస్తుత వరి పంటలో పొటాష్ లోపాన్ని గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. కలుపు నివారణకు అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. రబీ సీజన్‌లో ఆరుతడి పంటల సాగు ద్వారా నీటిని పొదుపుగా వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఆత్మ ఉప ప్రాజెక్టు డైరెక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ ద్వారా రైతులకు అందిస్తున్న వివిధ పథకాలు, వాటి ప్రయోజనాలను వివరించారు. అర్హులైన రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోంపేట సహాయ వ్యవసాయ సంచాలకులు బి.నరసింహమూర్తి మాట్లాడుతూ ముదురు నారు నాటే విధానం, ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు.
మండల వ్యవసాయ అధికారి కొంకేన సురేష్ మాట్లాడుతూ రైతు విశిష్ట సంఖ్య నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించడంతో పాటు ప్రస్తుత వరి పంటలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేశారు.
అనంతరం రైతులకు మట్టి విశ్లేషణ పత్రాలను అందజేశారు. మట్టి పరీక్ష ఫలితాల్లో సూచించిన మేరకు పంటకు అవసరమైన ఎరువులను సరైన మోతాదులో వినియోగించాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు ప్రదీప్, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.




