Telangana DGP: డీజీపీ ఎదుట 42 మంది మావోయిస్టుల లొంగుబాటు
Telangana DGP: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల అడుగుజాడలు కనుమరుగవుతున్నాయి. శుక్రవారం డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో ఏకంగా 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు.
Telangana DGP
Telangana DGP: తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల అడుగుజాడలు కనుమరుగవుతున్నాయి. శుక్రవారం డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో ఏకంగా 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. ఛత్తీస్‌గఢ్‌లో పోలీసుల ఒత్తిడి పెరగడం, తెలంగాణ ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలపై నమ్మకంతో వీరంతా అజ్ఞాతవాసాన్ని వీడి బయటకు వచ్చారు. దీంతో రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి దాదాపు శూన్యమైంది.
ఆయుధాలతో సహా జనజీవన స్రవంతిలోకి..
రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సోది మల్ల (కేశల్) వంటి కీలక నేతలతో పాటు మొత్తం 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరు తమ వెంట భారీగా ఆయుధాలను కూడా తీసుకువచ్చారు. పోలీసుల సమాచారం ప్రకారం.. వీరి నుండి ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున మొత్తం 800 గ్రాముల బరువున్న 8 బంగారు బిస్కెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన వారిలో ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన కుంజం ఇడుమాల్ (మహేందర్ )తప్ప మిగిలిన వారందరూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం.
తెలంగాణ కమిటీ ఖాళీ.. అజ్ఞాతంలో ఐదుగురే!
ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న మావోయిస్టు స్టేట్ కమిటీ ఇప్పుడు పూర్తిగా ఖాళీ అయిందని డీజీపీ ప్రకటించారు. గతంలో సెంట్రల్ కమిటీలో తెలంగాణ వారు 11 మంది ఉండగా, ప్రస్తుతం ఇద్దరు మాత్రమే మిగిలారు. ప్రస్తుతం గణపతి, పసనూరి నరహరి సెంట్రల్ కమిటీలో ఉండగా.. జాడే రత్నాభాయ్, వార్త శేఖర్, రంగబోయిన భాగ్య అనే ముగ్గురు మాత్రమే స్టేట్ కమిటీలో అజ్ఞాతంలో ఉన్నారు. గణపతి బతికే ఉన్నారని, అయితే ప్రస్తుతం ఆయన అడవిలో లేరని డీజీపీ స్పష్టం చేశారు. గాదె ఇన్నయ్య ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో వున్నాడని, ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ కి మాకు సంబంధం లేదు అని డీజీపీ వెల్లడించారు.
భారీ పునరావాస ప్యాకేజీ మరియు ఆరోగ్య రక్షణ
లొంగిపోయిన వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మొత్తం 763 మందికి పునరావాసం కోసం రూ.1.93 కోట్లు వెచ్చిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. తాజా లొంగుబాటులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తక్షణ సాయం కింద రూ.25,000 అందజేయనున్నారు. కుంజం ఇడుమాల్కు ఉన్న రూ.4 లక్షల రివార్డుతో పాటు, మిగిలిన వారిపై ఉన్న రివార్డు మొత్తాలను వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి జమ చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వీరందరికీ ప్రత్యేక ఆరోగ్య కార్డులు (హెల్త్ కార్డ్స్) కూడా మంజూరు చేయనున్నారు.
గణాంకాల్లో మావోయిస్టుల లొంగిబాటు
2024 నుండి ఇప్పటివరకు మొత్తం 761 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ కాలంలో 302 ఆయుధాలను స్వాధీనం చేసుకోగా, వాటిలో 206 ఏకే-47 తుపాకులు ఉండటం విశేషం. ఇప్పటికే తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించిన పోలీసులు, ఇంకా అజ్ఞాతంలో ఉన్న ఐదుగురు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు.




