Yashasvi Jaiswal: ముందుగానే ప్లాన్ చేశాం.. చాహర్, బుమ్రాను చితక్కొట్టాం.. హ్యాపీగా ఉంది!
Yashasvi Jaiswal: పవర్‌ప్లేలో కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎవరిని టార్గెట్ చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకున్నామని రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెప్పాడు.
Yashasvi Jaiswal: ముందుగానే ప్లాన్ చేశాం.. చాహర్, బుమ్రాను చితక్కొట్టాం.. హ్యాపీగా ఉంది!
Yashasvi Jaiswal: పవర్‌ప్లేలో కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎవరిని టార్గెట్ చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకున్నామని రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెప్పాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌కు వస్తున్నాడని చూసినప్పుడు అతడిపై దాడి చేయాలని తాను అనుకున్నా అని, తర్వాత జస్ప్రీత్ బుమ్రాను వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేశాడని తెలిపాడు. ప్రతి ఓవర్లో ఎవరిపై దాడి చేయాలి, ఏ షాట్లు ఆడాలి అన్నది ముందుగానే ప్లాన్ చేసుకుమని చెప్పుకొచ్చాడు. వైభవ్ అద్భుతంగా ఆడుతున్నాడని, అతడు కష్టపడే తీరు తనను కూడా ప్రేరేపిస్తుందని జైస్వాల్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం గౌహతిలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 27 పరుగుల తేడాతో గెలిచింది. జైస్వాల్ (77 నాటౌట్), వైభవ్ (39) కలిసి రాయల్స్‌కు మరో విజయాన్నందించారు.
వర్షం కారణంగా మ్యాచ్ 11 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 3 వికెట్లకు 150 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ ఛేదనలో ముంబై 9 వికెట్లకు 123 పరుగులే చేసింది. 32 బంతుల్లో 10 ఫోర్లు, 4సిక్సులు బాదిన యశస్వి జైస్వాల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం జైస్వాల్ మాట్లాడుతూ తన ఇన్నింగ్స్ వెనుక ఉన్న ఆలోచనలను వెల్లడించాడు. 'పవర్‌ప్లేలో కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఉన్నందున నా మైండ్‌లో ముందుగానే ఒక ప్లాన్ ఉంది. ఏ ఓవర్లను టార్గెట్ చేయాలి, ఎవరిపై దాడి చేయాలి అన్నది ఆలోచించా. చాహర్ బౌలింగ్‌కు వస్తున్నాడని చూసి అతడిపై దాడి చేయొచ్చని అనుకున్నాను. తర్వాత బుమ్రా బౌలింగ్‌కు వచ్చాడు. బుమ్రాను వైభవ్ ఎదుర్కొంటే బాగుంటుంది, నేను ఇంకొకరిని టార్గెట్ చేస్తాను అని అనుకున్నాను. ఇలా ఎవరిపై దాడి చేయాలి, ఏ షాట్లు ఆడాలి అన్నది ఆలోచిస్తూ మ్యాచ్‌లో పూర్తి ఫోకస్ పెట్టాను' అని చెప్పాడు.
'మూడు ఫార్మాట్లలో ఆడడం అంత సులభం కాదు. ఎలా మెరుగుపడాలో, ఏమి చేయాలో అని ప్రిపరేషన్లో ఆలోచిస్తాను. నా షాట్లను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తాను. ప్రతి వికెట్‌కు తగిన షాట్లు ఏవో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. బాగా సంసిద్ధం అయితే అది ఆటలో నాకు చాలా ఉపయోగపడుతుంది. నేను పరిస్థితిని అర్థం చేసుకుని, జట్టుకు ఏం అవసరమో అదే చేయాలని చూస్తాను. నా ఆటను ఎప్పటికప్పుడు మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఒక సమయంలో ఏ షాట్ అవసరమో దాన్నే ఆడేందుకు ప్రయత్నిస్తాను. జట్టు ప్రయోజనాలే నా మొదటి ప్రాధాన్యం' అని యశస్వి జైస్వాల్ తెలిపాడు.
'వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న తీరు అద్భుతం. అతడు చాలా కష్టపడుతున్నాడు. వైభవ్‌ను చూసి నేను కూడా ప్రేరణ పొందుతున్నాను. మేము తరచూ మాట్లాడుకుంటూ, ఎలా ఆడాలి అనే విషయంపై చర్చిస్తుంటాం. ఎవరిని టార్గెట్ చేయాలో ముందే మాట్లాడుకుంటాం. నువ్వు ఫ్రీగా ఆడు, బిందాస్‌గా ఆడు అని నేను ప్రోత్సహిస్తాను. వైభవ్ అద్భుతమైన ఆటగాడు. ఆటను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. ఆటను ఆస్వాదిస్తూ అద్భుతంగా ఆడుతున్నాడు' అని యశస్వి జైస్వాల్ ప్రశంసించాడు.


