Women's T20 World Cup 2026 : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 విజేతకు రూ.22 కోట్లు.. రన్నరప్‌కు ఎంతంటే?
Women's T20 World Cup 2026 : ఐసీసీ కొత్త ఛైర్మన్ జై షా ఈ 2026 ప్రపంచకప్‌ను మహిళల క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్‌గా అభివర్ణించారు.
Women's T20 World Cup 2026
Women's T20 World Cup 2026 : మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. నాలుగు వారాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మెగా టోర్నీలో పది దేశాలు వెనుదిరగగా, ఇప్పుడు కేవలం రెండు జట్లు మాత్రమే మిగిలాయి. జూలై 5న లార్డ్స్ వేదికగా జరగబోయే చారిత్రాత్మక ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, బలమైన ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈసారి ఐసీసీ మహిళల క్రికెట్ ప్రైజ్ మనీని భారీగా పెంచడం విశేషం. గత ప్రపంచకప్‌తో పోలిస్తే ప్రైజ్ పూల్‌లో ఏకంగా 10 శాతం మేర వృద్ధిని ప్రకటించింది. దీంతో ఈ మెగా టోర్నీలో గెలిచే విజేతపై కాసుల వర్షం కురవనుంది.
ఐసీసీ చరిత్రలోనే బిగ్గెస్ట్ టోర్నీ
ఐసీసీ కొత్త ఛైర్మన్ జై షా ఈ 2026 ప్రపంచకప్‌ను మహిళల క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్‌గా అభివర్ణించారు. దీనికి కారణం లేకపోలేదు. మహిళల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలు ఈసారి బరిలోకి దిగాయి. జట్ల సంఖ్య పెరగడంతో ఐసీసీ ప్రైజ్ మనీని కూడా భారీగా పెంచింది. ఈ 2026 టోర్నీ కోసం మొత్తం 87,64,615 అమెరికన్ డాలర్ల (సుమారు రూ.73.3 కోట్లు) ప్రైజ్ పూల్‌ను కేటాయించారు. కాగా, 2024లో జరిగిన గత వరల్డ్ కప్ ప్రైజ్ పూల్ విలువ 79,58,077 డాలర్లుగా ఉండేది.
చాంపియన్‌కు రూ.22 కోట్లు.. రన్నరప్‌కు కూడా భారీ మొత్తమే
లార్డ్స్ మైదానంలో జరగబోయే ఈ టైటిల్ పోరులో గెలిచి ట్రోఫీని ముద్దాడే జట్టుకు ఏకంగా 23,40,000 యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. భారత కరెన్సీలో దీని విలువ దాదాపు 22.2 కోట్ల రూపాయలు. టోర్నీలో జట్ల సంఖ్య పెరిగినప్పటికీ, విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీలో ఎలాంటి కోత పెట్టకుండా పాత మొత్తాన్ని అలాగే ఉంచారు. ఇక రన్నరప్‌గా నిలిచే జట్టుకు 11,70,000 అమెరికన్ డాలర్లు దక్కనున్నాయి, అంటే దాదాపు 11.1 కోట్ల రూపాయలు అన్నమాట. ఇప్పటికే ఆరుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ఏడో టైటిల్ కోసం కళ్లు పెట్టగా, ఇంగ్లాండ్ జట్టు 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించి రెండోసారి కప్పు కొట్టాలని పట్టుదలతో ఉంది. ఇంగ్లాండ్ చివరిసారిగా 2009లో ఛాంపియన్‌గా నిలిచింది.
భారత్, పాకిస్థాన్‌ల ఖాతాల్లోకి కోట్ల రూపాయలు
భారత్, పాకిస్థాన్‌లతో సహా మొత్తం 8 జట్లు గ్రూప్ స్టేజ్ (లీగ్ దశ) లోనే ఓడిపోయి టోర్నీ నుంచి వైదొలిగాయి. అయితే సెమీఫైనల్ చేరనప్పటికీ, ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ జట్లకు కూడా భారీగానే డబ్బులు అందనున్నాయి. టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టుకు కనీస బహుమతి మొత్తంగా రూ.2.35 కోట్లు లభిస్తాయి. దీనికి అదనంగా లీగ్ స్టేజ్‌లో సాధించే ప్రతి విజయానికి సుమారు రూ.29.6 లక్షల చొప్పున ఇన్సెంటివ్ ఇస్తారు. పాకిస్థాన్ జట్టు లీగ్ దశలో ఒక విజయాన్ని నమోదు చేయడంతో, కనీస మొత్తంతో పాటు అదనంగా 31,154 డాలర్లు (రూ.29.6 లక్షలు) సొంతం చేసుకుంటుంది.
మూడు విజయాలతో భారత్‌కు అదనపు బోనస్
ఈ ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా లీగ్ దశలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ సెమీస్ చేరలేకపోయింది. అయితే భారత్ ఆడిన మ్యాచ్‌లలో 3 విజయాలు నమోదు చేసింది. దీనివల్ల ప్రతి జట్టుకు వచ్చే కనీస మొత్తం రూ.2.35 కోట్లతో పాటు, మూడు విజయాలకు గానూ అదనంగా 94,462 డాలర్ల (సుమారు రూ.88.8 లక్షలు) బోనస్ ప్రైజ్ మనీని ఇండియా గెలుచుకుంది. ఇక టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టుగా నిలిచిన నెదర్లాండ్స్‌కు మాత్రం కేవలం కనీస ప్రైజ్ మనీ (రూ.2.35 కోట్లు) మాత్రమే దక్కుతుంది, వీరికి ఎలాంటి విక్టరీ ఇన్సెంటివ్ లభించదు.




