Vaibhav Sooryavanshi: ఆ ఒక్క విషయంలో తప్పనిసరిగా మెరుగవ్వాలి.. వైభవ్‌కు లక్ష్మణ్ కీలక సూచన!

Vaibhav Sooryavanshi: VVS Laxman praised Vaibhav Sooryavanshi's sensational Batting. జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు.

Rishvik
Published on: 27 July 2026 5:53 PM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: ఆ ఒక్క విషయంలో తప్పనిసరిగా మెరుగవ్వాలి.. వైభవ్‌కు లక్ష్మణ్ కీలక సూచన!

Vaibhav Sooryavanshi: జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌లలో కలిపి 151 రన్స్ బాధగా.. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆదివారం హరారేలో జరిగిన మూడో టీ20లో 49 బంతుల్లో 81 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన బుడ్డోడు.. భారత జట్టు సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌'గా నిలిచిన సూర్యవంశీపై టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ ఆటపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన హైదరాబాద్ సొగసరి లక్ష్మణ్.. ఒక విషయంలో మాత్రం తప్పనిసరిగా మెరుగుపడాలని సూచించాడు.

మూడో టీ20 మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన వీవీఎస్ లక్ష్మణ్.. వైభవ్ సూర్యవంశీ ప్రతిభను బీసీసీఐ రెండున్నరేళ్ల క్రితమే గుర్తించిందని వెల్లడించాడు. 'వైభవ్ ప్రతిభను బీసీసీఐ ముందుగానే గుర్తించింది. 2024 అండర్-19 ప్రపంచ కప్‌కు ముందు విజయవాడలో జరిగిన క్వాడ్రాంగ్యులర్ సిరీస్‌లో ఇండియా-బీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. అప్పుడే అతడు మా దృష్టిలోకి వచ్చాడు. ఆ తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో పలు శిక్షణా శిబిరాల్లో పాల్గొన్నాడు. అనంతరం అండర్-19 ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు' అని లక్ష్మణ్ చెప్పాడు.

వైభవ్ సూర్యవంశీ ఆటగాడిగానే కాకుండా వ్యక్తిగా కూడా ఎంతో పరిణతి సాధించాడని లక్ష్మణ్ ప్రశంసించాడు. 'గత ఆరు నెలల్లో వైభవ్ ఆలోచనా విధానం, అవగాహన, పరిపక్వత బిగా పెరిగాయయి. అందుకే ఒత్తిడి పరిస్థితుల్లో కూడా అత్యుత్తమ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ నిలకడగా రాణిస్తున్నాడు. అతడి మానసిక దృఢత్వమే ఈ విజయాలకు ప్రధాన కారణం. అయితే వైభవ్ ఇంకా మెరుగుపడాల్సిన ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. అదే ఫిట్‌నెస్. వైభవ్ వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. అతడు ఇంకా ఎదుగుతున్న దశలో ఉన్నాడు. బ్యాటింగ్‌తో పాటు శారీరక దృఢత్వాన్ని కూడా మరింత పెంచుకోవాలి. ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడితే అతడు మరింత గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడు' అని పేర్కొన్నాడు.

వైభవ్‌లో నేర్చుకోవాలనే తపన ఎంతో ఎక్కువగా ఉందని లక్ష్మణ్ వెల్లడించాడు. 'మూడో టీ20లో గాయపడినప్పటికీ మైదానాన్ని వీడేందుకు వైభవ్‌ సిద్ధంగా లేడు. జట్టు కోసం చివరి వరకు ఆడాలని కోరుకున్నాడు. అయితే ఫిజియో సూచనతోనే అతడిని బయటకు తీసుకువచ్చాము. జట్టు కోసం అన్ని విధాలుగా తన వంతు సహాయం చేయాలనే తపన వైభవ్‌లో కనిపిస్తోంది. అదే అతడిని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది' అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.

జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అసాధారణ బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. తొలి టీ20లో 19 బంతుల్లోనే అర్ధశతకం బాది అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. రెండో టీ20లో 9 బంతుల్లో 20 రన్స్ చేశాడు. మూడో మ్యాచ్‌లో 81 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా అందుకున్నాడు. ఇంత చిన్న వయసులోనే రెండు అవార్డులు గెలిచిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story