India Head Coach: గౌతమ్ గంభీర్ వద్దు.. హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌కు పెరుగుతున్న మద్దతు!
India Head Coach: VVS Laxman Gains Support as India Head Coach. జింబాబ్వేపై భారత్ సాధించిన క్లీన్‌స్వీప్ తర్వాత సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.
India Head Coach: గౌతమ్ గంభీర్ వద్దు.. హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌కు పెరుగుతున్న మద్దతు!
India Head Coach: ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో వరుస పరాజయాలతో తీవ్ర నిరాశలో ఉన్న టీమిండియా.. జింబాబ్వే పర్యటనలో ఘన విజయంతో మళ్లీ గెలుపు బాట పట్టింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జింబాబ్వేను 3-0తో క్లీన్‌స్వీప్ చేసి.. టీమిండియా అభిమానులు సంబరపడేలా చేసింది. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి ప్రత్యర్థి జింబాబ్వేకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మూడు మ్యాచ్‌లలో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది.
ఇటీవల గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా యూకే పర్యటనకు వెళ్లిన భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. టీ20 సిరీస్‌ల్లో ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో వరుస పరాజయాలు చూసింది. ఐర్లాండ్ సిరీస్‌ను 2-0తో కోల్పోయిన భారత్.. ఇంగ్లండ్ గడ్డపై 4-0తో సిరీస్ కోల్పోయింది. 7 మ్యాచ్‌లలో ఒక విజయం కూడా అందుకోలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను కూడా 2-1తో కోల్పోయింది. వరుస వైఫల్యాల నేపథ్యంలో గంభీర్ కోచింగ్‌పై అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వచ్చాయి.
గౌతమ్ గంభీర్ విశ్రాంతి తీసుకోవడంతో జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు మాజీ బ్యాటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆయన మార్గదర్శకత్వంలో యువ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఆడి మూడు మ్యాచ్‌ల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్, బౌలర్ల సమిష్టి ప్రదర్శన, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వం జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ భారీ తేడాతో గెలిచింది. దాంతో సారథి శ్రేయస్ ఖాతాలో కూడా తొలి సిరీస్ విజయం పడింది.
జింబాబ్వేపై భారత్ సాధించిన క్లీన్‌స్వీప్ తర్వాత సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను శాశ్వత హెడ్ కోచ్‌గా నియమించాలని కొందరు అభిమానులు, నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. లక్ష్మణ్ ఆధ్వర్యంలో యువ ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడుతున్నారని, జట్టులో సానుకూల వాతావరణం కనిపిస్తోందని పోస్టులు చేస్తున్నారు. అయితే ఒకే సిరీస్ ఫలితాల ఆధారంగా కోచ్ పనితీరును నిర్ణయించడం సరైన ప్రమాణం కాదని మరికొందరు అంటున్నారు. జట్టు ప్రదర్శనపై ప్రత్యర్థి బలం, ఆటగాళ్ల అందుబాటు, పరిస్థితులు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు. రాబోయే సిరీస్‌ల్లో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందన్నదే ఈ చర్చలకు మరింత స్పష్టత ఇవ్వనుంది.




