Virat Kohli Playoffs: డకౌట్, రెండే హాఫ్ సెంచరీలు.. ఆర్సీబీని కలవరపెడుతున్న కింగ్ కోహ్లీ ప్లేఆఫ్స్‌ రికార్డు!

Virat Kohli playoff record is troubling RCB. ఐపీఎల్ 2026లో క్వాలిఫయర్-1 మ్యాచ్ ముందు ఆర్సీబీని ఓ విషయం కలవరపెడుతోంది.

Rishvik
Published on: 26 May 2026 6:45 PM IST
Virat Kohli Playoffs
X

Virat Kohli Playoffs: డకౌట్, రెండే హాఫ్ సెంచరీలు.. ఆర్సీబీని కలవరపెడుతున్న కింగ్ కోహ్లీ ప్లేఆఫ్స్‌ రికార్డు!

Virat Kohli Playoffs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది. లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. 281 మ్యాచ్‌ల్లో 40.07 సగటు, 134.39 స్ట్రైక్‌రేట్‌తో 9218 పరుగులు, చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫునే ఆడుతున్న కింగ్.. ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే కోహ్లీకి ఇంతటి గొప్ప గణాంకాలున్నప్పటికీ.. ఐపీఎల్ 2026లో క్వాలిఫయర్-1 మ్యాచ్ ముందు ఆర్సీబీని ఓ విషయం కలవరపెడుతోంది.

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు ధర్మశాలలో మరికొద్దిసేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఈ సీజన్‌లో కూడా విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 557 పరుగులు చేసిన కింగ్.. 50.63 సగటుతో పాటు 163.82 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. ఇదే విరాట్ ఐపీఎల్ కెరీర్‌లో ఒక సీజన్‌లో నమోదైన అత్యుత్తమ స్ట్రైక్‌రేట్ కావడం విశేషం. అయితే ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో విరాట్ కోహ్లీ రికార్డు మాత్రం పేలవంగా ఉంది.

ఐపీఎల్ టోర్నీలో సెమీఫైనల్స్, క్వాలిఫయర్లు, ఫైనల్స్ కలిపి మొత్తం 17 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ.. 396 పరుగులు మాత్రమే చేశాడు. అతడి సగటు 26.4గా ఉంది. ఇందులో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉండగా.. ఒకసారి డక్ కూడా అవుట్ అయ్యాడు. కీలక మ్యాచ్‌ల్లో విరాట్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు తక్కువగా రావడం అభిమానులను నిరాశపరిచింది. 2009 సెమీఫైనల్లో చెన్నైపై 24 రన్స్ చేసిన కోహ్లీ.. అదే ఏడాది ఫైనల్లో డెక్కన్ ఛార్జర్స్‌పై కేవలం 7 పరుగులకే ఔటయ్యాడు. 2011 క్వాలిఫయర్-1లో సీఎస్‌కేపై 70 నాటౌట్‌తో మెరిసినా.. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 2016లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో డక్ అవుట్ కాగా.. ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 54 పరుగులు చేశాడు. 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై 43 పరుగులు చేసినప్పటికీ.. జట్టుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు, అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డులు విరాట్ కోహ్లీ పేరిట ఉన్నాయి. అయినప్పటికీ ప్లేఆఫ్స్‌లో తన గణాంకాలను మరింత మెరుగుపరుచుకోవాలనే లక్ష్యంతో కింగ్ బరిలోకి దిగనున్నాడు. ముఖ్యంగా క్వాలిఫయర్-1 వంటి కీలక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బలమైన బౌలింగ్ దాడిని ఎదుర్కొంటూ కోహ్లీ ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్సీబీ అభిమానులు మాత్రం మరోసారి కోహ్లీ నుంచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. గతం గురించి పట్టించుకోకుండా గుజరాత్‌పై కింగ్ చెలరేగిపోవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఒకవేళ కింగ్ ఈసారి ప్లేఆఫ్స్‌లో భారీ స్కోర్ చేస్తే.. గత విమర్శలకు బదులిచ్చినట్టే అవుతుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story