Virat Kohli: క్రికెట్‌కు నువ్వు ఇంకా కావాలి.. కోహ్లీకి దిగ్గజ క్రికెటర్ మెసేజ్!

Virat Kohli: కోల్‌కతా మెంటర్ డ్వేన్ బ్రావో విరాట్ కోహ్లీపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rishvik
Published on: 14 May 2026 8:53 PM IST
Virat Kohli
X

Virat Kohli: క్రికెట్‌కు నువ్వు ఇంకా కావాలి.. కోహ్లీకి దిగ్గజ క్రికెటర్ మెసేజ్!

Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ చూపించాడు. వరుసగా రెండు డకౌట్లు నమోదు చేసిన తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్)పై అద్భుత సెంచరీతో సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కింగ్ 60 బంతుల్లో అజేయంగా 105 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. కింగ్ సెంచరీతో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఇన్నింగ్స్ అనంతరం అభిమానులతో పాటు క్రికెట్ దిగ్గజాలు కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటర్, మాజీ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ షేర్ చేసిన వీడియోలో బ్రావో.. కోహ్లీని హత్తుకుని బాగా అడావు అంటూ ప్రశంసించాడు. ‘నీకు వీలైనంత కాలం ఆడు.. ఈ క్రీడకు నీ అవసరం ఇంకా ఉంది’ అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. కోహ్లీపై ప్రత్యర్థి జట్టు మెంటర్ కూడా ఇలాంటి గౌరవం చూపించడం అతడి గొప్పతనాన్ని తెలియజేస్తోందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

కేకేఆర్‌పై సెంచరీతో విరాట్ కోహ్లీ పలు అరుదైన రికార్డులు కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 14000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు. అంతేకాదు కేవలం 409 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్క్ చేరుకుని యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో గేల్ 423 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.

ఇక ఐపీఎల్‌లో ఇది కోహ్లీకి తొమ్మిదో సెంచరీ. అంతర్జాతీయ టీ20ల్లో ఒక సెంచరీ కలిపి.. మొత్తం 10 టీ20 సెంచరీలు నమోదు చేసిన తొలి భారత బ్యాటర్‌గా కూడా నిలిచాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ 22 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. బాబర్ ఆజమ్ 13 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్, కోహ్లీ చెరో 10 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు.

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా విరాట్ కోహ్లీ వేగంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు. అయితే కోహ్లీ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే.. మరిన్ని రికార్డులు అతడి ఖాతాలో చేరడం ఖాయం. వరుసగా రెండు డకౌట్ల తర్వాత ఇలాంటి భారీ సెంచరీతో కంబ్యాక్ ఇవ్వడం కేవలం కోహ్లీకే సాధ్యమని సోషల్ మీడియాలో అభిమానులు, నెటిజెన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story