RCB vs KKR : వరుస డకౌట్ల తర్వాత సెంచరీతో కోహ్లీ ఊచకోత.. కేకేఆర్‌పై ఆర్‌సీబీ ఘనవిజయం

RCB vs KKR : ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ ఘనవిజయం సాధించింది. వరుస డకౌట్ల తర్వాత విరాట్ కోహ్లీ (105*) అజేయ సెంచరీతో చెలరేగడంతో కేకేఆర్ పై బెంగళూరు 6 వికెట్ల తేడాతో గెలిచింది.

CR Reddy
Published on: 14 May 2026 6:40 AM IST
Virat Kohli Century
X

Virat Kohli Century

RCB vs KKR : రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జయభేరి మోగించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) విసిరిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్‌సీబీ మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. గత రెండు మ్యాచుల్లో వరుసగా సున్నా పరుగులకే అవుట్ అయి విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో అజేయ శతకంతో తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. 6 వికెట్ల తేడాతో కోల్‌కతాను మట్టికరిపించి ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జాకబ్ బెథెల్ (15) తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే, వన్ డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ (39)తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. పడిక్కల్ అవుట్ అయిన తర్వాత కెప్టెన్ రజత్ పాటిదార్ (11) కూడా నిరాశపరిచినా, కోహ్లీ మాత్రం పట్టు వదల్లేదు. మైదానం నలుమూలలా క్లాస్ షాట్లతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు.

విరాట్ కోహ్లీ కేవలం 58 బంతుల్లోనే తన ఐపీఎల్ కెరీర్‌లో 9వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 60 బంతులు ఆడిన కోహ్లీ.. 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా కూడా చరిత్ర సృష్టించాడు. జితేష్ శర్మ (8*) చివర్లో మెరుపులు మెరిపించడంతో 19.1 ఓవర్లలోనే ఆర్‌సీబీ విజయం ఖరారైంది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్.. అంగ్‌క్రిష్ రఘువంశీ (71), రింకూ సింగ్ (49 నాటౌట్) రాణించడంతో 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెరో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. అయితే కోహ్లీ విశ్వరూపం ముందు కేకేఆర్ బౌలర్లు చేతులెత్తేశారు. సునీల్ నరైన్, వైభవ్ అరోరా వంటి వారు కోహ్లీని కట్టడి చేయలేకపోయారు. ఈ గెలుపుతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story