Vaibhav Sooryavanshi: ఎంత పనాయే వైభవ్ సూర్యవంశీ.. ఇంకా మూడు ఏళ్లు ఆగాల్సిందే!

Vaibhav Sooryavanshi Funny Comments on Winning Car. వైభవ్ సూర్యవంశీ మరోసారి తన సరదా వ్యాఖ్యలతో అభిమానులను ఆకట్టుకున్నాడు.

Rishvik
Published on: 7 Jun 2026 5:30 PM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: ఎంత పనాయే వైభవ్ సూర్యవంశీ.. ఇంకా మూడు ఏళ్లు ఆగాల్సిందే!

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో సరికొత్త సంచలనంగా మారిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన సరదా వ్యాఖ్యలతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో ఎన్నో అవార్డులు గెలుచుకున్న వైభవ్‌కు స్పాన్సర్ల తరఫున ఒక లగ్జరీ ఎస్‌యూవీ కారు కూడా బహుమతిగా లభించింది. అయితే వైభవ్ వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే కావడంతో.. అతడు ప్రస్తుతం ఆ కారును నడపలేడు. దీనిపై స్పందించిన వైభవ్ తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ఓ ఇంటరాక్షన్‌లో కారు గురించి ప్రశ్నించగా.. 'ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది. ముందు డ్రైవింగ్ లైసెన్స్ రావాలి. అప్పటి వరకు మా నాన్నే ఆ కారును నడుపుతారు. నేను ఆయన పక్కన కూర్చుంటాను' అంటూ వైభవ్ సూర్యవంశీ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. 'అభీ తో లైసెన్స్ ఆనే దో' అని చెప్పిన బుడ్డోడి మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐపీఎల్ 2026లో వైభవ్ సీజన్ సూపర్ స్ట్రైకర్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇందుకు గాను రూ.10 లక్షలతో పాటు సరికొత్త టాటా సియెర్రా కారు బహుమతిగా వచ్చింది. ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, సీజన్ సూపర్ సిక్సర్లు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డులు కూడా అందుకున్నాడు.

ఇక అదే కార్యక్రమంలో తన విజయాల వెనుక ఉన్న మానసిక సిద్ధత గురించి కూడా వైభవ్ వెల్లడించాడు. మ్యాచ్‌లకు ముందే పరిస్థితులను ఊహించుకుని తనను తాను మానసికంగా సిద్ధం చేసుకుంటానని తెలిపాడు. 'నా గదిలో ఉన్నప్పుడు మ్యాచ్‌లో ఎలా ఆడాలి, ఏ బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలి, ఒత్తిడి పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే విషయాలను ముందుగానే ఊహించుకుంటాను. అది నాకు చాలా ఉపయోగపడుతుంది. శరీరాన్ని ఎంతగా శిక్షణ ఇస్తామో, మనసును కూడా అంతే బలంగా తయారు చేసుకోవాలి' అని చెప్పాడు. ఐపీఎల్ ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లలో ఒంటరిగా జట్టును గెలిపించాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మానసిక ధైర్యమే ముఖ్యమని వైభవ్ పేర్కొన్నాడు. చివరి ఓవర్లలో 50 లేదా 60 పరుగులు అవసరమైనప్పుడు ఒత్తిడిని తట్టుకుని ఆడాలంటే ముందస్తు మానసిక ప్రణాళిక అవసరమని వివరించాడు.

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. మొత్తం 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, విరాట్ కోహ్లీ వంటి స్టార్ బ్యాటర్లను వెనక్కి నెట్టి.. అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. అతడి దూకుడు బ్యాటింగ్, భారీ షాట్లు, ఒత్తిడిలోనూ అద్భుత ప్రదర్శనలు భారత సెలెక్టర్లను ఆకట్టుకున్నాయి. దీంతో ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత జట్టులో వైభవ్‌కు చోటు దక్కింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమిండియా పిలుపు అందుకున్న ఈ యువ సంచలనం ఇప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తుపై భారీ అంచనాలు పెంచుతున్నాడు. అభిమానులు కూడా అతడు అంతర్జాతీయ వేదికపై ఎలా రాణిస్తాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story