Vaibhav Sooryavanshi: వైభవ్ టాలెంట్‌ను ముందుగా గుర్తించింది ద్రవిడ్ కాదు.. మీరు అస్సలు ఊహించలేరు!
Vaibhav Sooryavanshi Telent Story. ఐపీఎల్ 2026 నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ గురించి ఓ ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Vaibhav Sooryavanshi: వైభవ్ టాలెంట్‌ను ముందుగా గుర్తించింది ద్రవిడ్ కాదు.. మీరు అస్సలు ఊహించలేరు!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం అంతాఇంతా కాదు. దూకుడైన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తునాడు. 15 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ ప్రపంచ స్థాయి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. బౌలర్ ఎవరైనా, మైదానం ఏదైనా.. బుడ్డోడు బాదుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే భారత భవిష్యత్తు సూపర్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే వైభవ్ టాలెంట్‌ను తొలిసారి ఎలా గుర్తించారు?, రాజస్థాన్ రాయల్స్ అతడిని ఎలా ఎంపిక చేసుకుంది? అనే ఆసక్తికర చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వైభవ్ సూర్యవంశీని తొలిసారి గుర్తించింది రాజస్థాన్ రాయల్స్ స్కౌటింగ్ టీమ్‌లో భాగమైన సమర్ ఖాద్రి. బిహార్‌కు చెందిన మాజీ క్రికెటర్ అయిన సమర్.. ఓ దేశీయ మ్యాచ్‌లో వైభవ్ బ్యాటింగ్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. చిన్న వయసులోనే భారీ సిక్సర్లు కొడుతూ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్న వైభవ్‌ను చూసి అతడిలో అసాధారణ ప్రతిభ ఉందని వెంటనే గుర్తించాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ హెడ్ ఆఫ్ స్కౌటింగ్ జుబిన్ భరూచాకు చెప్పాడు. సమర్ సూచనతో భరూచా వెంటనే వైభవ్‌కు ట్రయల్స్ ఏర్పాటు చేశాడు. అక్కడ జరిగిన సంఘటన ఇప్పుడు మరింత వైరల్ అవుతోంది. ట్రయల్స్‌లో వైభవ్ ఎదుర్కొన్న తొలి బంతినే భారీ సిక్సర్‌గా మలిచాడు. 60 బంతుల్లోనే 150కి పైగా పరుగులు బడ్డాడు. ఇది జుబిన్‌ను షాక్‌కు గురిచేసిందట.
ఆసక్తికర విషయం ఏమిటంటే.. రాజస్థాన్ రాయల్స్ ట్రయల్స్‌లో సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ కూడా తమ తొలి బంతినే సిక్సర్ కొట్టారు. ఇప్పుడు అదే లిస్టులో వైభవ్ సూర్యవంశీ కూడా చేరిపోయాడు. వైభవ్ బ్యాటింగ్ చూసిన తర్వాత జుబిన్ భరూచా అతడి టాలెంట్‌కు ఫిదా అయ్యాడు. వెంటనే రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్‌కు మెసేజ్ చేసి.. ‘ఒక జనరేషనల్ టాలెంట్ వస్తున్నాడు. వచ్చే వేలానికి రూ.10 కోట్లు సిద్ధంగా పెట్టండి’ అని చెప్పాడట. ఆ తర్వాత రాజస్థాన్ వైభవ్‌ను తమ జట్టులోకి తీసుకుంది. మొదట అతడిని భవిష్యత్తు కోసం సిద్ధం చేయగా.. ఇప్పుడు ఐపీఎల్ 2026లో బుడ్డోడు ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. భారీ సిక్సర్లు, అద్భుతమైన స్ట్రైక్‌రేట్‌తో ప్రపంచ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ప్రస్తుతం వైభవ్ ఆట చూస్తుంటే.. సమర్ ఖాద్రి, జుబిన్ భరూచా అతడిపై పెట్టుకున్న నమ్మకం ఎంత సరైందో ఇట్టే తెలుస్తోంది.
2024లో వైభవ్ సూర్యవంశీని రూ.1.10 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో బుడ్డోడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2025 సీజన్ మధ్యలో రాహుల్ ద్రవిడ్ అండతో వైభవ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తొలి సీజన్‌లో 7 మ్యాచ్‌లలో 252 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 36.00 సగటు, 206.55 స్ట్రైక్‌రేట్‌తో ఆడాడు. గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు బాదాడు. ఇక ఐపీఎల్ 2026లో వైభవ్ రెచ్చిపోతున్నాడు. ఇప్పటివరకు 15 మ్యాచ్‌లలో 47.14 సగటు, 242.85 స్ట్రైక్‌రేట్‌తో 680 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. రాజస్థాన్ మరోసారి భారత క్రికెట్‌కు భవిష్యత్తు స్టార్‌ను అందించిందని సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ తర్వాత ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కూడా ఆర్ఆర్ నుంచి వెలుగులోకి వచ్చిన మరో సూపర్ స్టార్‌గా మారిపోయాడు.




