నా అరంగేట్రం విషయం ముందుగా ఆయనకే చెప్పా.. ఆ తర్వాతే అమ్మకు.. వైభవ్ భావోద్వేగ వ్యాఖ్యలు!
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జీవితంలో 2026 జూలై 4 ఎప్పటికీ మరపురాని రోజుగా నిలిచిపోయింది.
నా అరంగేట్రం విషయం ముందుగా ఆయనకే చెప్పా.. ఆ తర్వాతే అమ్మకు.. వైభవ్ భావోద్వేగ వ్యాఖ్యలు!
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జీవితంలో 2026 జూలై 4 ఎప్పటికీ మరపురాని రోజుగా నిలిచిపోయింది. శనివారం ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన వైభవ్.. 15 సంవత్సరాల 99 రోజుల వయసులో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట దాదాపు 37 ఏళ్లుగా కొనసాగుతున్న రికార్డును అధిగమించాడు. అంతేకాదు పూర్తి సభ్యత్వం కలిగిన దేశాల పురుషుల టీ20 క్రికెట్లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు.
భారత జట్టు డెబ్యూ క్యాప్‌ను యువ బ్యాటర్ తిలక్ వర్మ చేతుల మీదుగా అందుకున్న వైభవ్ సూర్యవంశీకి ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. 'ఇది నీకే కాదు.. నీ కుటుంబానికి కూడా ఎంతో గర్వకారణమైన క్షణం. ఈ స్థాయికి చేరుకోవడానికి వారు ఎంతో కష్టపడ్డారు. నీ కష్టానికి ఫలితంగానే ఈ భారత జట్టు క్యాప్‌ను అందుకున్నావు. ఎలాంటి భయం లేకుండా, చిరునవ్వుతో, సరైన దృక్పథంతో నీ సహజమైన ఆటను కొనసాగించు' అంటూ తిలక్ వర్మ ప్రోత్సహించాడు.
డెబ్యూ క్యాప్ అందుకున్న తర్వాత తాను ముందుగా విషయాన్ని ఎవరికీ చెప్పాననే విషయాన్ని వైభవ్ ఆసక్తికరంగా వెల్లడించాడు. బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ.. 'భారత్ తరఫున ఆడటం ప్రతి భారత క్రికెటర్ కల. ఈ అవకాశం రావడం నా జీవితంలో అత్యంత గర్వకారణమైన విషయం. డెబ్యూ క్యాప్ అందుకున్న వెంటనే నా గదికి వెళ్లి ముందుగా నాన్న గారికి చెప్పాను. ఆయన తర్వాతే అమ్మకు, నా కోచ్ రోమి సర్‌కు ఈ విషయం చెప్పాను. నాన్న చాలా సంతోషపడ్డారు. ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా ఇప్పటివరకు ఎలా ఆడావో అలాగే ఆడాలని, నీ ఆటను నమ్ముకోవాలని నాకు సూచించారు' అని బుడ్డోడు చెప్పుకొచ్చాడు.
అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్‌లో వైభవ్ తన సహజ శైలిలోనే దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 10 బంతుల్లో 14 పరుగులు చేసి రెండు భారీ సిక్సర్లు బాదాడు. అయితే ఇంగ్లండ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టంపౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు. భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా.. అతడి ఆత్మవిశ్వాసం, నిర్భయమైన బ్యాటింగ్ అభిమానులను ఆకట్టుకుంది.
వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా కూడా తన శిష్యుడి అరంగేట్రంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఇది తమకు ఎంతో భావోద్వేగ క్షణమని పేర్కొన్న ఆయన.. వైభవ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా నిరూపించుకునే సమయం వచ్చిందని అన్నాడు. ఐపీఎల్, అండర్-19 ప్రపంచకప్‌లో చూపించిన ప్రతిభను టీమిండియా తరఫున కూడా కొనసాగిస్తాడనే నమ్మకం తనకు ఉందని తెలిపాడు.
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అసాధారణ ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారత క్రికెట్‌కు మరో భవిష్యత్ సూపర్ స్టార్ దొరికాడనే అభిప్రాయం మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. తొలి మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయినా.. రాబోయే మ్యాచ్‌ల్లో తన ప్రతిభతో మరిన్ని రికార్డులు సృష్టిస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




