Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి స్ఫూర్తి ఎవరో తెలుసా?.. సచిన్, ధోనీ, కోహ్లీ, రోహిత్ కాదండోయ్!

Vaibhav Sooryavanshi reveals how Sunil Gavaskar's His Inspiration. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు.

Rishvik
Published on: 1 Jun 2026 5:31 PM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి స్ఫూర్తి ఎవరో తెలుసా?.. సచిన్, ధోనీ, కోహ్లీ, రోహిత్ కాదండోయ్!

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ.. తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కథలే తనకు చిన్నప్పటి నుంచి స్ఫూర్తినిచ్చాయని చెప్పాడు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండానే వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొన్న గవాస్కర్ ధైర్యం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని వెల్లడించాడు. తనకు భయం కలిగినపుడు తన తండ్రి గవాస్కర్ గురించి చెప్పి ధైర్యం ఇచ్చాడని బుడ్డోడు చెప్పుకొచ్చాడు.

కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి 'ఆరెంజ్ క్యాప్' గెలుచుకున్నాడు. బుడ్డోడి అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్-2 వరకు చేరుకుంది. ఆర్ఆర్ ఫైనల్‌కు అడుగు దూరంలో నిలిచిపోయినా.. టోర్నీ మొత్తం వైభవ్ తన దూకుడు బ్యాటింగ్‌తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ సందర్భంగా మాట్లాడిన వైభవ్.. ఈ సీజన్ తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పాడు.

'మైదానంలోనూ, మైదానం బయటా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇంకా చాలా మెరుగుపడాలి. చాలా కాలం క్రికెట్ ఆడాలంటే నా ఆటను, ఫిట్‌నెస్‌ను మరింత అభివృద్ధి చేసుకోవాలి. ఈ సీజన్ ప్రారంభానికి ముందే నా ఫోన్‌లో ఒక నోట్ రాసుకున్నాను. ఈ ఐపీఎల్‌లో 700 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రతి మ్యాచ్ తర్వాత నా స్కోర్‌ను కూడా నమోదు చేసుకునేవాడిని. ఇంకా ఎన్ని రన్స్ కొట్టాలని లెక్కలు వేసుకునేవాడిని' అని తెలిపాడు.

అనంతరం సునీల్ గవాస్కర్ పక్కనే నిలబడి మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. తన తండ్రి చెప్పిన కథలను గుర్తు చేసుకున్నాడు. 'నా తండ్రి మీ గురించి చాలా కథలు చెప్పేవారు. మా ఇంటి దగ్గర సిమెంట్ వికెట్‌పై నేను ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ వికెట్‌ను కూడా మా నాన్నే తయారు చేశారు. చిన్నప్పుడు నేను కొన్నిసార్లు మంచి షాట్లు ఆడితే బౌలర్లు బౌన్సర్లు వేయడం మొదలుపెట్టేవారు. అప్పుడు నాకు కొంచెం భయం వేసేది, నిరాశ కలిగేది.

ఆ సమయంలో మా నాన్న మీ గురించి చెప్పేవారు. మా కాలంలో ఒక లెజెండ్ ఉండేవాడు. అతను హెల్మెట్ కూడా లేకుండా వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల బౌన్సర్లను ఎదుర్కొని సిక్సర్లు కొట్టేవాడు అని నాన్న చెప్పేవారు. ఆ మాటలు నాలో ఎంతో ధైర్యాన్ని నింపాయి. మీ గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేవారు. అదే నాకు స్ఫూర్తిగా మారింది' అని గవాస్కర్‌ను ఉద్దేశించి అన్నాడు.

వైభవ్ సూర్యవంశీ దూకుడైన బ్యాటింగ్ ఇప్పటికే క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. టాప్ ఫాస్ట్ బౌలర్లను కూడా ఏమాత్రం బెదురు లేకుండా ఎదుర్కొనే అతని శైలి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించిన వైభవ్.. కాగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్ వంటి అగ్రశ్రేణి బౌలర్లపై కూడా నిర్భయంగా దాడి చేయడం అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ వంటి పలు అవార్డులు గెలుచుకున్న వైభవ్.. భవిష్యత్ భారత క్రికెట్‌కు పెద్ద ఆశాకిరణంగా మారాడు. చిన్న వయసులోనే సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాల నుంచి స్ఫూర్తి పొంది ఎదిగిన ఈ యువ బ్యాటర్.. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story