Vaibhav Sooryavanshi: సూర్యవంశీ కారణంగా.. కోహ్లీ, రోహిత్‌పై ఒత్తిడి పెరిగిందా?
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో యువ ఆటగాళ్ల రాకతో సీనియర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై ఒత్తిడి పెరుగుతోందా?
Vaibhav Sooryavanshi: సూర్యవంశీ కారణంగా.. కోహ్లీ, రోహిత్‌పై ఒత్తిడి పెరిగిందా?
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో యువ ఆటగాళ్ల రాకతో సీనియర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై ఒత్తిడి పెరుగుతోందా? అనే ప్రశ్నకు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వంటి ప్రతిభావంతులు జట్టులోకి వస్తుండటంతో.. భవిష్యత్ వారసులపై చర్చలు సహజమేనని పేర్కొన్నాడు.
అయితే కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజాలు ఇప్పటికీ ప్రపంచ స్థాయి ఆటగాళ్లేనని స్పష్టం చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న భారత్.. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్రేమ్ స్వాన్ మాట్లాడుతూ.. ఒక ఆటగాడు కెరీర్ చివరి దశకు చేరుకుంటే అతని వారసుడు ఎవరు అనే చర్చ మొదలవడం సహజమని చెప్పాడు.
ఎవరు అనే విషయం సాధారణం:
'ఎంత గొప్ప ఆటగాడైనా కెరీర్ రెండో భాగంలోకి రావాల్సిందే. అప్పుడు అభిమానులు, నిపుణులు తదుపరి స్టార్ ఎవరు అనే దానిపై దృష్టి పెడతారు. విరాట్ కోహ్లీ తర్వాత ఎవరు?, రోహిత్ శర్మ తర్వాత ఎవరు? అనే ప్రశ్నలు రావడం సహజం. ఒకటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైతే ఈ చర్చ మరింత పెరుగుతుంది. వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్ల రాకతో టాప్ ఆర్డర్ బ్యాటర్లపై మరింత బాధ్యత పెరుగుతుంది.
రోహిత్‌కు రాబోయే ఆరు వారాలు చాలా కీలకం. ఐపీఎల్లో రోహిత్ అద్భుత ఫామ్‌లో కనిపించాడు. ఇప్పటికీ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్న రోహిత్‌ను ఎదుర్కోవడం ఏ బౌలర్‌కైనా కష్టమే' అని గ్రేమ్ స్వాన్ తెలిపాడు.
డూ ఆర్ డైగా చూడాల్సిన అవసరం లేదు:
ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌పై కూడా స్వాన్ స్పందించాడు. భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుందని.. ఈసారి కూడా కోహ్లీ, రోహిత్‌లపై అందరి దృష్టి ఉంటుందని చెప్పాడు. 'విరాట్ కోహ్లీ 2026 ఐపీఎల్లో 16 మ్యాచ్‌ల్లో 675 పరుగులు చేసి తన క్లాస్‌ను మరోసారి నిరూపించాడు.
వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్‌ను సీనియర్ ఆటగాళ్లకు డూ ఆర్ డైగా చూడాల్సిన అవసరం లేదు. రోహిత్, విరాట్లకు ఏం చేయాలో బాగా తెలుసు. ఇంగ్లండ్‌లో ఆ సమయంలో బ్యాటింగ్‌కు అనుకూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. వైట్ బాల్ క్రికెట్లో అక్కడ బ్యాటింగ్ చేయడం రెడ్ బాల్ కంటే సులభం. ఇంగ్లండ్ బౌలర్లకు ఇది కష్టమే' అని స్వాన్ చెప్పాడు.
సూర్యవంశీపై స్వాన్ ప్రశంసల వర్షం:
ఇక 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై స్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌ల కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ యువ సంచలనం ప్రత్యేక ప్రతిభ కలిగిన ఆటగాడని పేర్కొన్నాడు. 'వైభవ్ ఇప్పుడు భయం అంటే ఏంటో తెలియని వయసులో ఉన్నాడు. అండర్-19 స్థాయిలో, ఐపీఎల్లో అతను చూపిన ఆట అసాధారణం. ప్లేఆఫ్స్‌లో చేసిన రెండు 90ల ఇన్నింగ్స్‌లు అద్భుతం. చండీగఢ్‌లో ఆడిన ఒక ఇన్నింగ్స్‌ను నేను ప్రత్యక్షంగా చూశాను. 15 ఏళ్ల బాలుడి నుంచి అలాంటి ఆటను చూడటం ఆశ్చర్యకరం. అతను ప్రపంచ స్థాయి ఆటగాడు' అని స్వాన్ కొనియాడాడు.
అది మా దురదృష్టం:
భారత స్పిన్నర్ మానవ్ సుతార్‌పై కూడా స్వాన్ ప్రశంసలు కురిపించాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై అరంగేట్ర టెస్టులో ఆరు వికెట్లు తీసిన సుతార్ భవిష్యత్‌లో ప్రపంచ స్థాయి స్పిన్నర్‌గా ఎదుగుతాడని జోస్యం చెప్పాడు. 'సుతార్ గోల్డ్ లాంటి బౌలర్. కేవలం 10 బంతులు చూసినా అతని నైపుణ్యం అర్థమవుతుంది. రాబోయే పదేళ్ల పాటు ప్రపంచ స్థాయి స్పిన్నర్‌గా కొనసాగగల సామర్థ్యం అతనిలో ఉంది. అతను ఇంగ్లండ్ ఆటగాడు కాకపోవడం మా దురదృష్టం' అని గ్రేమ్ స్వాన్ చెప్పుకొచ్చాడు.




