Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కష్టమే.. కారణం ఏంటంటే?
Vaibhav Sooryavanshi Debut: Vaibhav Sooryavanshi Debut Doubt తొలి మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తాడనుకున్న వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కలేదు.
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కష్టమే.. కారణం ఏంటంటే?
Vaibhav Sooryavanshi Debut: ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో చారిత్రక ఓటమిని చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు రెండో మ్యాచ్‌కు సిద్దమవుతోంది. రెండో టీ20లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో ఉంది. బెల్‌ఫాస్ట్ వేదికగా ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు పూర్తి స్థాయి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. తొలి మ్యాచ్‌లో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 148 పరుగులకే ఆలౌట్ అయిన భారత్.. ఐర్లాండ్ చేతిలో అన్ని ఫార్మాట్లలో తొలి ఓటమిని ఎదుర్కొంది.
బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన సమస్య:
తొలి టీ20లో భారత బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. 2026 టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ కేవలం నాలుగు బంతులు ఎదుర్కొని ఐదు పరుగులకే అవుటయ్యాడు. ఐపీఎల్ 2026లో అదరగొట్టిన ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా పవర్‌ప్లేలోనే సింగిల్ డిజిట్ స్కోర్లతో పెవిలియన్ చేరారు. అభిషేక్ శర్మ మాత్రం తన సహజ శైలిలో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ అర్ధ శతకం నమోదు చేశాడు. అయితే మరో ఎండ్ నుంచి సరైన సహకారం లేకపోవడంతో అతని ఇన్నింగ్స్ కూడా వృథా అయింది.
ఐర్లాండ్ యువ బౌలర్ల సత్తా:
ఐర్లాండ్ అరంగేట్ర పేసర్లు జై మూంద్రా, మ్యాట్ హోలార్డ్ భారత టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి బంతికే జై మూంద్రా సంజు శాంసన్ వికెట్ తీశాడు. మ్యాట్ హోలార్డ్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ వికెట్లు పడగొట్టి మూడు వికెట్లతో మెరిశాడు. తిలక్ వర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ కూడా ఒత్తిడిని తట్టుకోలేకపోవడంతో భారత్ భారీ ఓటమిని చవిచూసింది.
వైభవ్ అరంగేట్రం మళ్లీ కష్టమే:
తొలి మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తాడని అందరూ భావించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కలేదు. రెండో టీ20లో కూడా అతడికి అవకాశం వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఒక్క ఓటమి తర్వాతే టాప్ ఆర్డర్‌లో మార్పులు చేసే ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ లేదని సమాచారం. వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలంటే.. బ్యాటింగ్ విభాగంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి రెండో టీ20లో అదే కాంబినేషన్ కొనసాగించే అవకాశం ఉంది. మళ్లీ సంజు విఫలమైతే.. ఇంగ్లండ్ సిరీసులో బుడ్డోడికి అవకాశం దక్కే ఛాన్సెస్ మెండుగా ఉంటాయి.
బౌలింగ్‌లో మెరిసిన హర్షిత్ రాణా:
బ్యాటింగ్ నిరాశపరిచినా భారత బౌలింగ్‌లో కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. నాలుగు నెలల తర్వాత మోకాలి గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3/24 గణాంకాలతో అతడు ఆకట్టుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ కూడా డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అయితే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేసర్లను ప్రారంభంలోనే ఎక్కువగా వినియోగించడం చివరి ఓవర్లలో ప్రభావం చూపింది. వాషింగ్టన్ సుందర్ 16వ ఓవర్‌లో 19 పరుగులు ఇవ్వగా.. ప్రసిద్ధ్ కృష్ణ 17వ ఓవర్‌లో 27 పరుగులు సమర్పించుకున్నాడు. 0/57 గణాంకాలతో అతడు తీవ్ర నిరాశపరిచాడు. ఆ రెండు ఓవర్లలో ఐర్లాండ్ అదనంగా చేసిన 20-30 పరుగులే చివరికి మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి.
ఆత్మవిశ్వాసంతో ఐర్లాండ్:
ఐర్లాండ్ ఇన్నింగ్స్‌కు కెప్టెన్ లోర్కన్ టక్కర్ అర్ధ శతకంతో అద్భుతమైన పునాది వేశాడు. తొలి 11 బంతుల్లో ఐదు పరుగులే చేసిన టక్కర్.. తర్వాత వేగం పెంచి 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు గారెత్ డెలానీ 32 బంతుల్లో 49 పరుగులు చేసి కీలక సహకారం అందించాడు. ఈ ఇద్దరి ఇన్నింగ్స్‌లతో ఐర్లాండ్ 182/9 స్కోరు చేసింది. భారత్‌పై తొలి అంతర్జాతీయ విజయాన్ని నమోదు చేసిన ఉత్సాహంతో ఐర్లాండ్ మరోసారి బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు లయను అందుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో మెరుగైన ఆటతీరును కనబర్చాల్సిందే. సిరీస్‌ను సమం చేయాలంటే బ్యాటింగ్ వైఫల్యాన్ని అధిగమించడం భారత జట్టుకు అత్యంత కీలకంగా మారింది.




