Vaibhav Sooryavanshi: చరిత్ర సృష్టించిన వైభవ్‌ ఖాతాలో చెత్త రికార్డు.. తొలి భారత ఆటగాడిగా!

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంతో చరిత్ర సృష్టించినప్పటికీ ఓ అరుదైన చెత్త రికార్డు కూడా నమోదైంది.

Rishvik
Published on: 5 July 2026 9:50 AM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: చరిత్ర సృష్టించిన వైభవ్‌ ఖాతాలో చెత్త రికార్డు.. తొలి భారత ఆటగాడిగా!

Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంతో చరిత్ర సృష్టించినప్పటికీ.. అదే మ్యాచ్‌లో బుడ్డోడి పేరిట ఓ అరుదైన చెత్త రికార్డు కూడా నమోదైంది. శనివారం ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత జట్టు తరఫున 15 ఏళ్ల వైభవ్ తొలి మ్యాచ్ ఆడాడు. దాంతో 15 సంవత్సరాల 99 రోజుల వయసులో టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే అదే మ్యాచ్‌లో టీ20 అంతర్జాతీయ అరంగేట్రంలో స్టంపౌట్ అయిన తొలి భారత క్రికెటర్‌గా కూడా నిలిచాడు.

వైభవ్ తన ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించాడు. కేవలం 10 బంతుల్లో 14 పరుగులు చేసిన బుడ్డోడు రెండు భారీ సిక్సర్లతో తన దూకుడును చూపించాడు. అయితే ఇంగ్లండ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో మరో భారీ షాట్ ఆడేందుకు క్రీజు వదిలి ముందుకు రావడంతో బంతి మిస్ అయింది. వెంటనే వికెట్‌కీపర్ చాకచక్యంగా బైల్స్‌ను పడగొట్టడంతో వైభవ్ స్టంపౌట్ అయ్యాడు. దీంతో టీ20 అంతర్జాతీయ అరంగేట్రంలో స్టంపౌట్ అయిన తొలి భారత ఆటగాడిగా అతడి పేరు రికార్డుల్లో నిలిచింది. దాంతో అరంగేట్ర మ్యాచ్‌లో చెత్త రికార్డును బుడ్డోడు ఖాతాలో వేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (43), ఇషాన్ కిషన్ (49), శ్రేయాస్ అయ్యర్ (37) రాణించగా.. చివర్లో తిలక్ వర్మ (24) వేగంగా పరుగులు చేసి జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే అర్ష్‌దీప్ సింగ్ భారీ షాక్ ఇచ్చాడు. తొలి బంతికే ఫిల్ సాల్ట్‌ను డకౌట్ చేసిన అర్ష్‌దీప్.. వెంటనే జోస్ బట్లర్‌ను కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపించాడు. దీంతో ఇంగ్లండ్ 1 పరుగుకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అయితే కెప్టెన్ హ్యారీ బ్రూక్ కేవలం 12 బంతుల్లో 39 పరుగులు చేసి మ్యాచ్‌ను మళ్లీ ఇంగ్లండ్ వైపు తిప్పాడు. అనంతరం జేకబ్ బెతెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ 46 బంతుల్లో 76 పరుగులు చేశాడు. టామ్ బాంటన్ (39)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయానికి చేరువ చేశాడు. మధ్యలో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి వికెట్లు తీసినా.. బెతెల్ దూకుడును అడ్డుకోలేకపోయారు.

రవి బిష్ణోయ్ వేసిన ఒక ఓవర్‌లో బెతెల్ ఏకంగా 29 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను పూర్తిగా ఇంగ్లండ్ వైపు తిప్పేశాడు. చివర్లో జోఫ్రా ఆర్చర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముగించిన బెతెల్.. మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌కు నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో.. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story