Vaibhav Sooryavanshi: వైభవ్ ఆలాంటోడు కాదు.. నిజం తెలుసుకోకుండా విమర్శించొద్దు!

Vaibhav Sooryavanshi: లంక ఆటగాళ్లతో వాగ్వాదంపై వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా స్పందించారు.

Rishvik
Published on: 16 Jun 2026 7:11 PM IST
Vaibhav Sooryavanshi
X

Vaibhav Sooryavanshi: వైభవ్ ఆలాంటోడు కాదు.. నిజం తెలుసుకోకుండా విమర్శించొద్దు!

Vaibhav Sooryavanshi: శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం భారత్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. లంక ఆటగాళ్లతో వాగ్వాదం, తోపులాట వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత చిన్న వయసులో అంత టెంపర్ పనికిరాదు అంటూ.. కొందరు నెటిజెన్స్ బుడ్డోడిని విమర్శించారు. ఈ నేపథ్యంలో వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా స్పందించారు. అసలు ఆ సంఘటన వెనుక ఉన్న నిజాలను తెలుసుకోకుండా వైభవ్‌ను విమర్శించడం సరైంది కాదన్నారు.

వైభవ్‌ను చిన్నప్పటినుంచి చూస్తున్నా:

వైభవ్ ఏడేళ్ల వయసు నుంచి తన వద్ద వైభవ్ సూర్యవంశీ శిక్షణ పొందుతున్నాడని, అతని స్వభావం తనకు బాగా తెలుసని కోచ్ మనీష్ ఓఝా తెలిపారు. 'వైభవ్ ఎలా ప్రవర్తిస్తాడో నాకు పూర్తిగా తెలుసు. ఏమి జరిగిందో తెలుసుకోకుండా చాలా మంది అతడిని తప్పుబడుతున్నారు. కానీ వాస్తవం మరోలా ఉంది' అని అన్నారు. మ్యాచ్ అనంతరం వైభవ్‌తో తాను మాట్లాడినట్లు కోచ్ వెల్లడించారు. మ్యాచ్ సమయంలో శ్రీలంక ఆటగాళ్లు అతడిని పదేపదే మాటలతో రెచ్చగొట్టారని, వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేశారని వైభవ్ తనకు చెప్పాడని తెలిపారు. 'చాలా సేపు వైభవ్ సహనంతో వ్యవహరించాడు. కానీ ప్రతి ఒక్కరికీ ఒక హద్దు ఉంటుంది. పదేపదే విమర్శలు చేయడంతోనే అతడు స్పందించాడు' అని కోచ్ వివరించారు.

పూర్తి విషయం తెలుసుకోవాలి:

ఈ ఘటనలో వైభవ్ ప్రతిస్పందనను మాత్రమే చూసి తీర్పు ఇవ్వడం సరికాదని మనీష్ ఓఝా అభిప్రాయపడ్డారు. 'ఒక ఆటగాడి స్పందన వెనుక ఉన్న కారణాలను కూడా పరిశీలించాలి. అతడిని విమర్శించే ముందు పూర్తి విషయం తెలుసుకోవాలి. యువ ఆటగాడిగా వైభవ్ ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో మనం అతడికి అండగా నిలవాలి' అని అన్నారు. భారత క్రికెట్‌లో భవిష్యత్తు తారగా భావిస్తున్న వైభవ్ ఇటీవల తన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే శ్రీలంక-ఎతో జరిగిన మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న వాగ్వాదం, తోపులాట వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో అతని కోచ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఇక నువ్వు ఇంటికి వెళ్లు అంటూ ఎగతాళి:

ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారిక విచారణ లేదా పూర్తి నివేదిక వెలువడలేదు. అయితే ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. శ్రీలంక ఆటగాడు విశేన్ హలంబాగే నేరుగా వైభవ్ సూర్యవంశీ వద్దకు వెళ్లి టీజ్ చేశాడు. 'మ్యాచ్ అయిపోయింది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లు' అంటూ ఎగతాళిగా మాట్లాడాడు. ఈ మాటలతో తీవ్ర ఆవేశానికి లోనైన వైభవ్.. హలంబాగేకి బదులిచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తోపులాట వరకు వెళ్లగా.. పరిస్థితి చేయి దాటకముందే అంపైర్లు, అక్కడున్న లంక ఆటగాళ్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story