Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి కీలక బాధ్యత.. 'ప్రిపరేషన్' అంటూ మెసేజ్!
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో కీలక టోర్నీకి సిద్ధమవుతున్నాడు.
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి కీలక బాధ్యత.. 'ప్రిపరేషన్' అంటూ మెసేజ్!
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో కీలక టోర్నీకి సిద్ధమవుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి ఇప్పటికే తన సత్తా చాటిన ఈ 15 ఏళ్ల బ్యాటర్.. ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో నాయకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. 2026-27 దేశవాళీ సీజన్‌లో భాగంగా జరగనున్న దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వైభవ్ ఎంపికయ్యాడు. దులీప్ ట్రోఫీకి ముందు వైభవ్ తన సన్నద్ధతను ప్రారంభించాడు. కొత్త దేశవాళీ సీజన్‌కు ముందు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను వైభవ్ సూర్యవంశీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు ‘ప్రిపరేషన్’ అనే సందేశాన్ని జోడించాడు. దీంతో రాబోయే సీజన్ కోసం వైభవ్ ఎంత సీరియస్‌గా సిద్ధమవుతున్నాడో స్పష్టమవుతోంది. బ్యాటింగ్‌లో డిఫెన్స్‌తో పాటు అటాకింగ్ షాట్లపై కూడా వైభవ్ దృష్టి పెట్టినట్లు అర్ధమవుతోంది. బ్యాటింగ్ మాత్రమే కాదు.. వైస్ కెప్టెన్సీలో రాణించాలని బుడ్డోడు పట్టుదలగా ఉన్నాడు. భవిష్యత్ కెప్టెన్‌గా సూర్యవంశీని తీర్చిదిద్దాలనే పట్టుదలతో ఉన్నామని ఈస్ట్ జోన్ సెలెక్టర్లు ఇప్పటికే చెప్పారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో వైభవ్ ప్రయాణం పెను సంచలనంగా మొదలైంది. ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో 15 ఏళ్ల వయసులోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మాంచెస్టర్‌లో జరిగిన రెండో టీ20లో బరిలోకి దిగిన వైభవ్ 15 ఏళ్ల 99 రోజుల వయసులో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. సచిన్ టెస్టుల్లో 16 ఏళ్ల 205 రోజుల వయసులో, వన్డేల్లో 16 ఏళ్ల 238 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే ఇంగ్లండ్ పర్యటన వైభవ్‌కు ఆశించిన స్థాయిలో సాగలేదు. ఆ సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా 20 పరుగుల మార్కును అందుకోలేకపోయాడు. భారత్ ఆ సిరీస్‌ను 1-4తో కోల్పోయింది. కానీ ఆ తర్వాత జింబాబ్వే పర్యటనలో వైభవ్ అసలు సత్తాను చూపించాడు.
జింబాబ్వేపై మూడు టీ20 మ్యాచ్‌ల్లో 151 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఆ సిరీస్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. 50.33 సగటుతో, ఏకంగా 196.10 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధసెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 81. అతడి అద్భుత ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా దక్కింది. టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో భారత్ తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేయడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు ఆరు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వైభవ్ 32.16 సగటుతో 193 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్ 189.21గా ఉంది. రెండు అర్ధసెంచరీలు కూడా అతడి ఖాతాలో ఉన్నాయి. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడం మాములు విషయం కాదు.
ఇప్పుడు వైభవ్ దృష్టి దులీప్ ట్రోఫీపై పడింది. 2026-27 దేశవాళీ సీజన్‌లో భాగంగా ఆగస్టు 23 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ జట్లు తలపడనున్నాయి. ఈస్ట్ జోన్ జట్టుకు వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. వైభవ్‌కు ఇది మరో మంచి అవకాశం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన ఈ యువ ఆటగాడు.. ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ముందుండి. సీనియర్ బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి బుడ్డోడు ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో ఈ టోర్నీ ద్వారా అతడి బ్యాటింగ్‌లోని మరో కోణాన్ని చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది. వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం అతడి కెరీర్‌లో మరో కీలక మలుపు. నెట్స్‌లో ‘Preparation’ అంటూ సందేశం ఇచ్చిన వైభవ్.. రాబోయే సవాళ్లకు తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాన్ని ఇచ్చాడు.
ఈస్ట్ జోన్ జట్టు:
ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ ఘరామి, మహ్మద్ షమీ, ముఖేశ్ కుమార్, షాబాజ్ అహ్మద్, సూరజ్ జైస్వాల్, విరాట్ సింగ్, కుమార్ కుశాగ్ర, శిఖర్ మోహన్, సుబ్రాంశు సేనాపతి, అభిజిత్ సర్కార్, అనుకూల్ రాయ్, డెనిష్ దాస్.




