Uppal Stadium: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు తప్పని తిప్పలు.. వేల రూపాయలు పెట్టి టికెట్ కొన్నా తుడుచుకోక తప్పలేదు!

Uppal Stadium Chaos: ఎస్‌ఆర్‌హెచ్ జట్టును ప్రోత్సహించేందుకు వేల రూపాయలు వెచ్చించి టికెట్లు కొనుగోలు చేసిన ఫ్యాన్స్‌కు స్టేడియంలో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం తీవ్ర అసంతృప్తిని కలిగించింది.

Rishvik
Published on: 5 April 2026 7:16 PM IST
Uppal Stadium Chaos: SRH Fans Slam Poor Facilities, Dusty Seats in IPL 2026
X

Uppal Stadium: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు తప్పని తిప్పలు.. వేల రూపాయలు పెట్టి టికెట్ కొన్నా తుడుచుకోక తప్పలేదు!

Uppal Stadium: ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌ భారీగా స్టేడియంకు తరలివచ్చారు. ఈ సీజన్లో ఇదే మొదటి మ్యాచ్ కాబట్టి.. ఉప్పల్ స్టేడియంలో ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. ఎస్‌ఆర్‌హెచ్ జట్టును ప్రోత్సహించేందుకు వేల రూపాయలు వెచ్చించి టికెట్లు కొనుగోలు చేసిన ఫ్యాన్స్‌కు స్టేడియంలో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం తీవ్ర అసంతృప్తిని కలిగించింది.

స్టేడియంలో సీట్లపై దుమ్ము పేరుకుపోవడంతో ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. సీట్లు శుభ్రంగా లేకపోవడంతో.. చాలామంది తమ కర్చీఫ్‌లతో సీట్లను తుడుచుకుని కూర్చోవాల్సి వచ్చింది. కొందరు తమ వెంట తెచ్చుకున్న ప్లకార్డులను సీట్లపై వేసుకుని కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మ్యాచ్‌ను ఆస్వాదించాలనే ఆశతో వచ్చిన అభిమానులకు ఇది పెద్ద నిరాశగా మారింది. హెచ్‌సీఏ నిర్వాహకులపై ఫాన్స్ మండిపడుతున్నారు. కనీస వసతులు లేవు, ఇక హెచ్‌సీఏ మారదు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. భద్రతా కారణాల పేరుతో కొన్ని వస్తువులను స్టేడియంలోకి అనుమతించకపోవడం కూడా మరో సమస్యగా మారింది. సన్ గ్లాసెస్, పర్సులు, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్ వాచ్‌లు వంటి వస్తువులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో అభిమానులు బయటే వాటిని వదిలేయాల్సి వచ్చింది. అయితే ముందుగా అనుమతి ఉందని చెప్పి, చివరి నిమిషంలో ఆంక్షలు విధించడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. 'వాలెట్, స్మార్ట్ వాచ్ లేకుండా ఎలా లోపలికి వెళ్తాం?, ఇప్పటికిప్పుడు వాటిని ఎక్కడ పెట్టాలి? అంటూ అభిమానులు సిబ్బందిని నిలదీశారు. గతంలో ఇలాంటి వాటిని అనుమతించిన సందర్భాలు ఉన్నాయని, ఇప్పుడు ఒక్కసారిగా ఆంక్షలు విధించడం సరికాదని ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్‌ఆర్‌హెచ్, ఎల్ఎస్‌జీ మ్యాచ్ కంటే.. స్టేడియం నిర్వహణపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, ఆకస్మిక ఆంక్షలు విధించడం వల్ల అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని క్రికెట్ ఫాన్స్ కోరుతున్నారు. ఉప్పల్ స్టేడియం సన్‌రైజర్స్ సొంత మైదానం. నేటితో ఓ మ్యాచ్ పూర్తి కాగా.. ఇంకా ఆరు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఫాన్స్ ఆగ్రహంతో వచ్చే మ్యాచులలో అయినా హెచ్‌సీఏ యాజమాన్యం సరైన సౌకర్యాలు ఉండేలా చూస్తుందేమో చూడాలి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story