IPL 2026 : ఐపీఎల్ వేళ పంజాబ్ కింగ్స్‌లో విషాదం.. స్టార్ ప్లేయర్ తల్లి కన్నుమూత
IPL 2026 : ఐపీఎల్ 2026 మధ్యలో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ తల్లి మరణించారు. ఈ విషాద వార్తతో క్రికెట్ లోకం దిగ్భ్రాంతికి గురైంది.
Azmatullah Omarzai
IPL 2026 : ఐపీఎల్ 2026 సందడి మధ్య పంజాబ్ కింగ్స్ జట్టులో తీవ్ర విషాదం నెలకొంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఆఫ్ఘనిస్తాన్ సంచలనం అజ్మతుల్లా ఒమర్జాయ్ మాతృవియోగంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే ఐపీఎల్ వర్గాలతో పాటు క్రికెట్ అభిమానుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒమర్జాయ్ కుటుంబానికి అండగా ఉంటామని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ప్రకటించింది.
అజ్మతుల్లా ఒమర్జాయ్ తల్లి మరణించిన వార్తను ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ నబీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "మా స్నేహితుడు, ఆఫ్ఘన్ క్రికెటర్ ఒమర్జాయ్ తల్లి మరణించారని చెప్పడానికి చాలా బాధగా ఉంది. అల్లా ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను" అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరో ఆల్‌రౌండర్ కరీం జనత్ కూడా ఈ విషాద వార్తను ధ్రువీకరించారు.
తమ ఆటగాడికి జరిగిన ఈ తీరని లోటుపై పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ భావోద్వేగంగా స్పందించింది. "ఒమర్జాయ్, వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఈ కష్టకాలంలో పంజాబ్ కింగ్స్ కుటుంబం మొత్తం మీకు తోడుగా ఉంటుంది" అని అధికారికంగా ప్రకటించింది. ఇతర జట్టు సభ్యులు కూడా ఒమర్జాయ్‌ను ఓదారుస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు.
ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ ఒమర్జాయ్‌ను రూ.2.4 కోట్లకు దక్కించుకుంది. అయితే, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆయనకు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో పాటు అద్భుతమైన బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ఈ ఆల్‌రౌండర్.. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీశారు. అంతర్జాతీయ టీ20ల్లో 54 వికెట్లు, 800 పైగా పరుగులతో ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన ఆటగాడిగా గుర్తింపు పొందారు.
తల్లి అంత్యక్రియల నిమిత్తం ఒమర్జాయ్ త్వరలోనే ఆఫ్ఘనిస్తాన్ వెళ్లే అవకాశం ఉంది. దీనిపై జట్టు యాజమాన్యం అధికారిక సమాచారం ఇవ్వనప్పటికీ, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన స్వదేశానికి వెళ్లడానికి అనుమతి లభించవచ్చు. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, తమ ఆటగాడికి జరిగిన ఈ నష్టం జట్టును తీవ్రంగా కలచివేసింది.




