Tilak Varma: తిలక్ వర్మ హీరో కావాలనుకున్నాడు.. కేవలం స్వార్థం కోసమే ఆడాడు!

Tilak Varma: రెండో టీ20లో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఆడిన బ్యాటింగ్‌పై మాజీ భారత కెప్టెన్ తీవ్ర విమర్శలు చేశారు.

Rishvik
Published on: 30 Jun 2026 9:33 PM IST
Tilak Varma
X

Tilak Varma: తిలక్ వర్మ హీరో కావాలనుకున్నాడు.. కేవలం స్వార్థం కోసమే ఆడాడు!

Tilak Varma: ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 0-2తో దారుణంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే టీమిండియా రెండు మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆటతీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రెండో టీ20లో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఆడిన బ్యాటింగ్‌పై మాజీ భారత కెప్టెన్, మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర విమర్శలు చేశారు. జట్టు కోసం కాకుండా.. వ్యక్తిగత ఇన్నింగ్స్‌పైనే దృష్టి పెట్టాడని ఆరోపించారు. తిలక్ తానే హీరో కావాలనుకున్నాడని.. కేవలం స్వార్థం కోసం మాత్రమే ఆడాడని మండిపడ్డారు.

బెల్‌ఫాస్ట్‌లో జరిగిన రెండో టీ20లో 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ చివరికి ఒక పరుగు తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ 46 బంతుల్లో 55 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే అవసరమైన రన్‌రేట్‌కు అనుగుణంగా వేగంగా ఆడకపోవడం జట్టు ఓటమికి ప్రధాన కారణమైందని క్రిస్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. 'మిడిల్ ఓవర్లలో భారత్ ఆడిన తీరు ఏమాత్రం సరికాదు. ముఖ్యంగా తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. ఆ దశలో ఇన్నింగ్స్‌ను నిర్మిస్తూనే దూకుడుగా ఆడాల్సింది. లేకపోతే లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టమవుతుంది. ఇది ఆటగాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ స్లో బ్యాటింగ్ కారణంగానే మ్యాచ్ ఓడిపోయాం' అని అన్నారు.

'తిలక్ వర్మ ఒక్కో పరుగు, రెండు పరుగులు తీసుకుంటూ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించడంపైనే దృష్టి పెట్టాడు. చివరి వరకు నిలబడి మ్యాచ్‌ను తానే గెలిపించి హీరో కావాలని ప్రయత్నించాడు. మ్యాచ్ గెలిచాక జెర్సీ పైకెత్తి సెలబ్రేట్ చేయాలనుకున్నట్లుగా కనిపించింది. కానీ ఇలాంటి లక్ష్యాలను చివరి బంతి వరకు తీసుకెళ్లకుండా.. కనీసం ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించాలి.

ఐర్లాండ్ చేతిలో ఓటమికి తిలక్ వర్మే కారణం. హీరో కావాలని మాత్రమే ఆడాడు' అంటూ ఘాటుగా విమర్శించారు. అలాగే శివమ్ దూబే (16 బంతుల్లో 20 పరుగులు), అక్షర్ పటేల్ (18 బంతుల్లో 14 పరుగులు) కూడా అవసరమైన వేగంతో ఆడలేదని శ్రీకాంత్ పేర్కొన్నారు. మధ్య ఓవర్లలో ఈ ముగ్గురు బ్యాటర్లు వేగం పెంచకపోవడం వల్లే భారత్‌పై ఒత్తిడి పెరిగిందని అభిప్రాయపడ్డారు.

తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే ఔటైన తర్వాత బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా 10 బంతుల్లో 21 పరుగులు చేసి భారత్‌కు ఆశలు రేకెత్తించాడు. అయితే చివరి రెండు బంతుల్లో ఏడు పరుగులు అవసరమైన సమయంలో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో హర్షిత్ ఔటవడంతో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఐర్లాండ్ చేతిలో తొలి సారి టీ20 సిరీస్ కోల్పోయిన భారత్‌పై ఇప్పటికే మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు శ్రీకాంత్ వ్యాఖ్యలు కూడా జట్టు బ్యాటింగ్ విధానంపై మరింత చర్చకు దారితీశాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story