Thai Footballer: మ్యాచ్ మధ్యలో పిడుగు.. యువ ఫుట్‌బాలర్ మృతి, 12 మందికి గాయాలు.. షాకింగ్ వీడియో వైరల్!
Thai Footballer: Thai Footballer Dies After Lightning Strike During Match. థాయ్‌లాండ్‌లో జరిగిన ఓ స్థానిక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Thai Footballer: మ్యాచ్ మధ్యలో పిడుగు.. యువ ఫుట్‌బాలర్ మృతి, 12 మందికి గాయాలు.. షాకింగ్ వీడియో వైరల్!
Thai Footballer: థాయ్‌లాండ్‌లో జరిగిన ఓ స్థానిక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వర్షంలో మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో మైదానంపై ఒక్కసారిగా పిడుగు పడింది. పిడుగు పాటుకు 24 ఏళ్ల యువ ఫుట్‌బాలర్ సోఫ్‌వాన్ అవే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో 12 మంది ఆటగాళ్లు గాయపడగా.. వారికి వైద్యులు చికిత్స చేశారు. పిడుగుకు సంబందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియో చూసిన అందరూ షాక్‌కు గురవుతున్నారు.
'ది ఇండిపెండెంట్' కథనం ప్రకారం... మంగళవారం దక్షిణ థాయ్‌లాండ్‌లో స్థానిక టోర్నీ గోలోక్ ఎఫ్‌ఏ కప్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ టోర్నీలో అమేచ్యూర్, థాయ్-మలేషియన్ జట్ల ప్లేయర్స్ పాల్గొన్నారు. సోఫ్‌వాన్ అవే ప్రాతినిధ్యం వహిస్తున్న సామ్‌కోల్ట్స్ జట్టు, అబు ఎక్స్ నాంగ్ సిరిన్ జట్టుతో తలపడుతోంది. మ్యాచ్ జరుగుతుండగానే భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో అకస్మాత్తుగా మైదానంపై పిడుగు పడింది. భారీ శబ్దంతో మెరుపు పడగానే ఆటగాళ్లు భయంతో పరుగులు తీశారు. అయితే వింగర్‌గా ఆడుతున్న సోఫ్‌వాన్ అవే మాత్రం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
సహచర ఆటగాళ్లు వెంటనే సోఫ్‌వాన్ అవే వద్దకు వెళ్లి చూడగా.. అతడిలో స్పందన లేదు. అత్యవసర వైద్య బృందం వెంటనే చికిత్స అందించింది. అతడిని కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తీవ్ర గాయాల కారణంగా సోఫ్‌వాన్ అక్కడికక్కడే చనిపోయాడు. దాంతో గోలోక్ ఎఫ్‌ఏ కప్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వర్షం, ఉరుములు, మెరుపులు ఉన్నప్పటికీ మ్యాచ్ ఎందుకు కొనసాగించారని మండిపడుతున్నారు. 'తుఫాను పరిస్థితుల్లో మ్యాచ్‌ను వెంటనే నిలిపివేయాలి, 'ఆటగాళ్ల భద్రత విషయంలో నిర్వాహకులు జాగ్రత్తగా ఉండాల్సింది', 'ఒక యువ ఆటగాడి ప్రాణం ఇలా పోవడం ఎంతో బాధాకరం' అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
ఈ విషాద ఘటనపై ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ థాయ్‌లాండ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సోఫ్‌వాన్ అవే కుటుంబ సభ్యులకు, అతడి క్లబ్‌కు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. థాయ్‌లాండ్‌లో పిడుగు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయని అక్కడి అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2020 నుంచి 2024 మధ్య దేశవ్యాప్తంగా కనీసం 283 మంది పిడుగుపాటుకు గురయ్యారు. వారిలో చాలామంది అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ఘటన క్రీడా పోటీల సమయంలో వాతావరణ పరిస్థితులను నిర్లక్ష్యం చేయడం ఎంత ప్రమాదకరమో గుర్తు చేసింది. ఆటగాళ్ల భద్రతే అత్యంత ప్రాధాన్యమని నిర్వహకులు ఇప్పటికైనా గుర్తించాలి.




