TG20: టీజీ20 టోర్నీలో రాహుల్ రదేశ్ విధ్వంసకర సెంచరీ!

TG20: ఉప్పల్‌లో జరుగుతున్న TG20-2026 టోర్నీలో ఈఐపీఎల్ & ఎలెవెన్ కరీంనగర్ డైమండ్స్ జట్టు 133 పరుగుల భారీ తేడాతో మెదక్ ఫాల్కన్స్‌పై చారిత్రాత్మక విజయం సాధించింది.

KARUNAKAR, UPPAL
Published on: 1 July 2026 10:05 AM IST
TG20
X

TG20: టీజీ20 టోర్నీలో రాహుల్ రదేశ్ విధ్వంసకర సెంచరీ!

హైదరాబాద్ ఉప్పల్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనిధి యూనివర్సిటీ TG20-2026 టోర్నీలో EIPL & eleve కరీంనగర్ డైమండ్స్ జట్టు మరోసారి తన సత్తా చాటింది. మంగళవారం మెదక్ ఫాల్కన్స్‌పై అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన డైమండ్స్ 133 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

వరుసగా రెండో విజయాన్ని అందుకున్న కరీంనగర్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్ డైమండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఆరంభంలో వరుసగా మూడు వికెట్లు కోల్పోయి 58/3 వద్ద కష్టాల్లో పడిన జట్టును రాహుల్ రదేశ్, చందన్ సహాని అద్భుత భాగస్వామ్యంతో గట్టెక్కించారు.

ఇద్దరూ నాలుగో వికెట్‌కు కేవలం 76 బంతుల్లో 163 పరుగులు జోడించి టోర్నీలోనే అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో రాహుల్ రదేశ్ బ్యాటింగ్ అభిమానులను ఉర్రూతలూగించింది. కేవలం 48 బంతుల్లో 101 పరుగులు చేసి మెరుపు సెంచరీ నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండగా, కేవలం 46 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు.

మరోవైపు చందన్ సహాని 36 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు బలమైన ముగింపునిచ్చాడు. 15వ ఓవర్‌లో రాహుల్ రదేశ్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదడంతో ఒక్క ఓవర్‌లోనే 35 పరుగులు వచ్చాయి. ఇది టోర్నీలో ఇప్పటివరకు నమోదైన అత్యంత ఖరీదైన ఓవర్‌గా నిలిచింది. చివరి ఎనిమిది ఓవర్లలోనే డైమండ్స్ 135 పరుగులు రాబట్టడం మ్యాచ్‌ను పూర్తిగా ఏకపక్షంగా మార్చింది.

233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ ఫాల్కన్స్ ఆరంభం నుంచే తడబడింది. కరీంనగర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఫాల్కన్స్ 19.1 ఓవర్లలో కేవలం 99 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ రవి తేజ (37) మాత్రమే కొంతసేపు ప్రతిఘటించగా, మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు.

ఈ స్కోరు టోర్నీలో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప స్కోరుగా నిలిచింది. బౌలింగ్‌లో ఆశిష్ శ్రీవాస్తవ్ (2/13), శుభమ్ శర్మ (2/16) అద్భుతంగా రాణించగా, హరీష్ ఠాకూర్, అఖిల్ కుమార్, సతీష్ కుమార్, నారాయణ తేజ, సత్విక్ రెడ్డి కూడా తలో వికెట్ తీసి జట్టు విజయాన్ని సులభం చేశారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story