TG20: కోటి ప్రైజ్ మనీ ఎవరిదో? ఉత్కంఠ రేపుతోన్న TG20 ఫైనల్ మ్యాచ్

TG20: హెచ్‌సీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనిధి యూనివర్సిటీ టీజీ20 (TG20) టోర్నమెంట్ నేటితో ముగియనుంది.

KARUNAKAR, UPPAL
Published on: 12 July 2026 7:12 AM IST
TG20
X

TG20: కోటి ప్రైజ్ మనీ ఎవరిదో? ఉత్కంఠ రేపుతోన్న TG20 ఫైనల్ మ్యాచ్

ఉప్పల్: తెలంగాణ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీనిధి యూనివర్సిటీ టీజీ20 టోర్నమెంట్ నేడు (ఆదివారం) గ్రాండ్ ఫైనల్‌తో ముగియనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం జరగనున్న టైటిల్ పోరులో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు, అన్విత ఖమ్మం ఏసెస్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి టీజీ20 ట్రోఫీని కైవసం చేసుకునేందుకు ఇరు జట్లు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయి.

ఫైనల్‌కు ముందు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగం రావు, హెచ్‌సీఏ సెక్రెటరీ మన్నె జీవన్ రెడ్డి, ట్రెజరర్ అనిల్ కుమార్‌తో పాటు ఇరు జట్ల కెప్టెన్లు సీవీ మిలింద్ (అన్విత ఖమ్మం ఏసెస్), అభిరత్ రెడ్డి (హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్) పాల్గొన్నారు. ఫైనల్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించేలా ప్రత్యేక కార్యక్రమాలు సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ట్రోఫీపై ఇరు జట్ల ధీమా

లీగ్ దశ నుంచే అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న ఈ రెండు జట్లు టైటిల్‌పై కన్నేశాయి. క్వాలిఫయర్-1లో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్‌కు తొలి ఓటమిని రుచి చూపించి నేరుగా ఫైనల్ చేరిన అన్విత ఖమ్మం ఏసెస్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు క్వాలిఫయర్-2లో కరీంనగర్ డైమండ్స్‌పై ఘన విజయం సాధించిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్, గత ఓటమికి ప్రతీకారం తీర్చుకుని తొలి ఛాంపియన్‌గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ప్రారంభ వేడుకలు

ఫైనల్ మ్యాచ్‌కు ముందు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఐదు సాంస్కృతిక బృందాల ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ప్రత్యేక సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. జాతీయ గీతాలాపనతో ప్రారంభమయ్యే వేడుకల్లో రంగురంగుల స్టేజ్ షోలు, మ్యాచ్ మధ్యలో వినోదాత్మక కార్యక్రమాలు, ఫైర్‌వర్క్స్ ప్రేక్షకులను అలరించనున్నాయి. అవార్డుల ప్రదానోత్సవాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

దేశంలోనే అత్యధిక ప్రైజ్ మనీ

టోర్నమెంట్ విజేతకు రూ.1 కోటి, రన్నరప్‌కు రూ.50 లక్షలు, మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లకు చెరో రూ.25 లక్షలు నగదు బహుమతిగా అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశీయ టీ20 లీగ్‌లలో ఇదే అత్యధిక ప్రైజ్ మనీ అని వారు పేర్కొన్నారు.

లక్షలాది మంది వీక్షించిన టీజీ20

టీజీ20 టోర్నమెంట్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను మూడు లక్షలకు పైగా ప్రేక్షకులు ప్రత్యక్షంగా స్టేడియానికి వచ్చి వీక్షించినట్లు వెల్లడించారు. ఫైనల్ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ నెలకొనడంతో నేడు కూడా భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే, టీజీ20 యువ క్రికెటర్లతో పాటు జిల్లా స్థాయి ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అత్యుత్తమ వేదికగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

ఈ టోర్నమెంట్‌లో రాణించిన ఆటగాళ్లకు భవిష్యత్తులో ఐపీఎల్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశాలు దక్కేలా టీజీ20 ఒక వారధిగా మారుతుందని పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించగలిగామని, అయినప్పటికీ ప్రేక్షకులు, క్రికెట్ అభిమానులు, స్పాన్సర్లు విశేష ఆదరణ చూపారని నిర్వాహకులు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించే టీజీ20 సీజన్‌కు మరింత భారీ స్పందన లభిస్తుందని,

మరింత ఉన్నత స్థాయిలో టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. టీజీ20 ద్వారా తెలంగాణలో క్రికెట్‌కు కొత్త ఊపు వచ్చిందని, రాష్ట్రంలో క్రికెట్ సంస్కృతి మరింత బలోపేతం కావడంతో పాటు భవిష్యత్తులో తెలంగాణ నుంచి మరింత మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశాలు పెరుగుతాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story