Team India: వైభవ్ డెబ్యూ, ఆ ముగ్గురు స్టార్ల రీఎంట్రీ.. ఇంగ్లండ్ సిరీస్‌లకు టీ20 జట్టు ఇదే?

Team India: ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది. ఇక భారత జట్టు త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో సిరీస్‌లను ఆడనుంది.

Rishvik
Published on: 2 Jun 2026 6:27 PM IST
Team India
X

Team India: వైభవ్ డెబ్యూ, ఆ ముగ్గురు స్టార్ల రీఎంట్రీ.. ఇంగ్లండ్ సిరీస్‌లకు టీ20 జట్టు ఇదే?

Team India: ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది. ఇక భారత జట్టు త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో సిరీస్‌లను ఆడనుంది. ఈ టీ20 సిరీస్‌ల కోసం ఎంపికయ్యే జట్టుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. భారత జట్టులో పలు కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లకు అవకాశాలు దక్కనున్నట్లు తెలుస్తోంది. బుడ్డోడు వైభవ్ సూర్యవంశీతో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్లకు టీంఇండియాలో చోటు దక్కనుందట. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.

వైభవ్ డెబ్యూ:

భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్‌లో భారత జట్టును విజయవంతంగా నడిపిస్తున్న సూర్యకుమార్‌పై బీసీసీఐ సెలెక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారట. అతని నాయకత్వంలో యువ ఆటగాళ్లకు మరింత అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత ఆసక్తికర అంశం ఏంటంటే.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేయనున్నాడట. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సంచలన ప్రదర్శన చేసిన 15 ఏళ్ల వైభవ్.. 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అతని దూకుడైన బ్యాటింగ్, అసాధారణ స్ట్రైక్‌రేట్ సెలెక్టర్లను ఆకట్టుకుంది. త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో బుడ్డోడి ప్రయాణం ప్రారంభం కానుంది.

ముగ్గురు సీనియర్లకు చోటు:

అదే సమయంలో సీనియర్ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా మళ్లీ టీ20 జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026లో ముగ్గురూ నిలకడైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా భువనేశ్వర్ తన స్వింగ్ బౌలింగ్‌తో, కృనాల్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. శ్రేయస్ కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు కూడా జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ మరో టైటిల్‌ అందుకోవడంలో రజత్ కీలక పాత్ర పోషించాడు. బిగ్ మ్యాచ్‌ల్లో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు ఆడి బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్:

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, అక్షర్ పటేల్ ఇప్పటికే టీ20 జట్టులో ఉన్న విషయం తెలిసిందే. అభిషేక్, సంజూ, ఇషాన్ ఐపీఎల్ 2026లో రాణించారు. విఫలమైన హార్దిక్, అర్ష్‌దీప్, దూబేలపై బీసీసీఐ సెలెక్టర్లు నమ్మకం ఉంచనున్నారు. జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నారు. వైభవ్ సూర్యవంశీకి అవకాశం వస్తే.. భారత క్రికెట్‌లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లే అవుతుంది. చూడాలి మరి ఎవరికి చోటు దక్కుతుందో.

భారత టీ20 జట్టు (అంచనా):

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రజత్ పాటిదార్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, అక్షర్ పటేల్.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story