Team India Record: 93 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. టీమిండియా టాప్ 5 బిగ్గెస్ట్ విన్నింగ్ లిస్ట్ ఇదే!

Team India Biggest Test Wins List. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత్ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

Rishvik
Published on: 8 Jun 2026 5:13 PM IST
Team India Record: 93 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. టీమిండియా టాప్ 5 బిగ్గెస్ట్ విన్నింగ్ లిస్ట్ ఇదే!
X

Team India Record: ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత్ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో అఫ్గాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. తన 93 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద ఇన్నింగ్స్ విజయాన్ని అందుకుంది. అంతకుముందు 2018లో రాజ్‌కోట్‌లో వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో గెలవడం భారత్ బిగ్గెస్ట్ విన్నింగ్ రికార్డుగా ఉండేది. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌పై ఇన్నింగ్స్ 300 పరుగుల విజయం సాధించి.. సరికొత్త చరిత్ర సృష్టించింది.

మ్యాచ్ హీరోగా మానవ్:

అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ మ్యాచ్ హీరోగా నిలిచాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (126), కేఎల్ రాహుల్ (100)లు సెంచరీలు చేయగా.. రిషభ్ పంత్ (81), సాయి సుదర్శన్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైంది. మానవ్ సుతార్ అద్భుత బౌలింగ్‌తో చెలరేగిపోయాడు. 22 ఓవర్లలో 10 మెయిడెన్లు వేసి.. కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్ట్ అరంగేట్ర ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 10వ భారత బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఈ శతాబ్దంలో భారత తరఫున డెబ్యూ టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

రెండో ఇన్నింగ్స్‌లో మరింత దారుణం:

ఫాలోఆన్ ఆడిన అఫ్గానిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో మరింత దారుణంగా ఆడింది. భారత స్పిన్నర్ల ధాటికి 35.5 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీసి అఫ్గాన్ బ్యాటింగ్‌ను దెబ్బతీయగా.. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో చెలరేగాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. దాంతో భారత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. టెస్టుల్లో టీమిండియాకు ఇది అతిపెద్ద విజయం కావడం విశేషం. 2018లో రాజ్‌కోట్‌లో సాధించిన 272 పరుగుల విజయం రెండో స్థానానికి పడిపోయింది.

అశ్విన్ వారసుడు మానవ్:

ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు మానవ్ సుతార్. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన ఈ 23 ఏళ్ల ఎడమచేతి స్పిన్నర్ తన కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, టర్న్, బౌన్స్‌తో అఫ్గాన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6/33, రెండో ఇన్నింగ్స్‌లో 1/29తో.. మొత్తం 7 వికెట్లు తీసి తన ప్రతిభను చాటుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో, రవీంద్ర జడేజా కెరీర్ చివరి దశలో ఉండటంతో భారత స్పిన్ విభాగానికి వారసుడు ఎవరు అనే ప్రశ్నకు మానవ్ సమాధానంగా కనిపిస్తున్నాడు. టర్నింగ్ ట్రాక్‌లపై మాత్రమే కాకుండా.. ఫ్లాట్ పిచ్‌లపై కూడా వికెట్లు తీయగల సామర్థ్యం తనకు ఉందని ఈ మ్యాచ్ ద్వారా నిరూపించాడు.

టీమిండియా బిగ్గెస్ట్ ఇన్నింగ్స్‌ విన్స్ లిస్ట్:

ఇన్నింగ్స్‌ 300 పరుగులు (అఫ్గానిస్థాన్‌) ముల్లన్‌పూర్, 2026

ఇన్నింగ్స్‌ 272 పరుగులు (వెస్టిండీస్‌) రాజ్‌కోట్, 2018

ఇన్నింగ్స్‌ 262 పరుగులు (అఫ్గానిస్థాన్‌) బెంగళూరు, 2018

ఇన్నింగ్స్‌ 239 పరుగులు (బంగ్లాదేశ్‌) మీర్పూర్, 2007

ఇన్నింగ్స్‌ 239 పరుగులు (శ్రీలంక), నాగ్‌పూర్, 2017

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story