Suryakumar Yadav: టీ20 వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్‌కే టీమిండియాలో చోటులేదు?
Suryakumar Yadav: నెలలు తిరిగేసరికి ఏకంగా భారత జట్టులో తన స్థానాన్నే కోల్పోయే ప్రమాదంలోసూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు.
Suryakumar Yadav: టీ20 వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్‌కే టీమిండియాలో చోటులేదు?
Suryakumar Yadav: కొన్ని నెలల క్రితం వరకు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. 2026 టీ20 ప్రపంచ కప్‌ను భారత్‌కు అందించిన నాయకుడిగా అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. నెలలు తిరిగేసరికి ఏకంగా భారత జట్టులో తన స్థానాన్నే కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడు. ఒకప్పుడు భారత టీ20 జట్టుకు ప్రధాన బలంగా నిలిచిన మిస్టర్ 360.. ఇప్పుడు జట్టుకు భారంగా మారాడు? అంటే.. అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సూర్య ఎలా ఈ పరిస్థితికి చేరుకున్నాడన్న ప్రశ్న ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
2025 ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచినప్పటికీ.. ఆ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత ప్రదర్శన నిరాశపరిచింది. ఏడు మ్యాచ్‌ల్లో కేవలం 72 పరుగులు మాత్రమే చేశాడు. అయితే భారత్ టైటిల్ గెలవడంతో అతడి ఫామ్‌పై పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఆ తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌ల్లో కూడా సూరీడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 2026 జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో వరుసగా రెండు అర్ధ సెంచరీలు చేసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో టీ20 ప్రపంచ కప్‌కు ముందు భారత జట్టుకు ఇది మంచి సంకేతంగా భావించారు. 2026 ప్రపంచ కప్‌లో అమెరికాపై అజేయంగా 84 పరుగులు చేసినప్పటికీ.. అదే అతడి ఏకైక అర్ధ సెంచరీగా నిలిచింది. మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల్లో 242 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికీ భారత్ ట్రోఫీ గెలవడంతో సూర్య కెప్టెన్సీపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
అయితే సూర్యకుమార్ యాదవ్‌కు అసలు సమస్య ఐపీఎల్ 2026లో మొదలైంది. తన కెరీర్‌ను తీర్చిదిద్దిన టోర్నీలో మళ్లీ పాత ఫామ్‌ను అందుకుంటాడని అందరూ భావించారు. కానీ ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సూర్య 270 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అతడి సగటు కేవలం 20.77గా ఉంది. ముంబై కూడా పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలవడంతో విమర్శలు మరింత పెరిగాయి. ప్రత్యర్థి జట్లు సూర్యకుమార్ బ్యాటింగ్‌లోని బలహీనతలను గుర్తించి.. వ్యూహాత్మకంగా బౌలింగ్ చేయడం కూడా అతడి ప్రదర్శనపై ప్రభావం చూపింది. ఒకప్పుడు అతడి ప్రత్యేకమైన షాట్లు అభిమానులను అలరించేవి. కానీ ఇప్పుడు అదే షాట్ ఎంపిక అతడికి సమస్యగా మారింది.
ఇక భారత క్రికెట్ భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా కూడా సూర్యకుమార్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. 2028 టీ20 ప్రపంచ కప్‌తో పాటు లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న సూర్య భవిష్యత్ ప్రణాళికల్లో సరిపోతాడా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు బలమైన ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్నారు. ముఖ్యంగా ఐపీఎల్లో శ్రేయస్ ప్రదర్శన, నాయకత్వ నైపుణ్యం సెలెక్టర్లను ఆకట్టుకున్నట్లు సమాచారం. దీంతో టీ20 జట్టులో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. సూర్యకుమార్ భవిష్యత్తుపై తుది నిర్ణయం రాబోయే సిరీస్‌ల కోసం జట్టు ఎంపిక సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉంది.




