Suryakumar Yadav: ఏం గుండె రా అది.. కెప్టెన్సీ ఊడినా హుందాతనం చాటిన సూర్యకుమార్!
Suryakumar Yadav: Suryakumar Yadav React on Captaincy Exit భారత టీ20 కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ తన హుందాతనాన్ని చాటుకున్నాడు.
Suryakumar Yadav: ఏం గుండె రా అది.. కెప్టెన్సీ ఊడినా హుందాతనం చాటిన సూర్యకుమార్!
Suryakumar Yadav: భారత టీ20 జట్టులో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన టీ20 జట్టులో కూడా చోటు కల్పించలేదు.
అతడి స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కొత్త టీ20 కెప్టెన్‌గా బీసీసీఐ సెలెక్టర్లు నియమించారు. టీ20 ప్రపంచ కప్ గెలిపించిన మూడు నెలలకే సూర్యకు ఈ ఊహించని షాక్ తగలడం క్రికెట్ వర్గాల్లో ఇపుడు చర్చనీయాంశమైంది.
విజయాలు సాధించాలని కోరుకుంటున్నా:
టీ20 ప్రపంచ కప్, ఐపీఎల్ 2026లోనూ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతోనే బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ కప్‌లో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 242 పరుగులు మాత్రమే చేసిన సూర్య.. అమెరికాపై చేసిన 84 పరుగులే అతడి అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఐపీఎల్ 2026లో 13 మ్యాచులలో 270 రన్స్ మాత్రమే చేశాడు.
అయితే కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత కూడా సూర్యకుమార్ తన హుందాతనాన్ని చాటుకున్నాడు. జట్టు ఎంపిక అనంతరం తొలిసారిగా సోషల్ మీడియాలో స్పందించిన సూర్య.. భారత జట్టు ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ 'ఈ ప్రతిభావంతమైన జట్టుకు ముందున్న సవాళ్లలో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను' అని పోస్ట్ చేశాడు. సూరీడి రిప్లై అభిమానులను ఆకట్టుకుంది. 'ఏం గుండె రా అది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నీ అర్హతతో సంపాదించుకున్నావు:
మరోవైపు భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా సూర్యకుమార్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. 'వైభవ్.. నువ్వు ఈ అవకాశాన్ని పూర్తిగా అర్హతతో సంపాదించుకున్నావు. నీ ప్రయాణాన్ని ఆసక్తిగా గమనిస్తాను. మంచి భవిషత్తు ఉంది నీకు. ఆల్ ది బెస్ట్' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సీనియర్ ఆటగాడిగా యువ క్రికెటర్‌కు అతడు ఇచ్చిన ప్రోత్సాహం ప్రశంసలు అందుకుంటోంది.
కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జాతీయ జట్టులోకి ఎంపికైన వైభవ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న బుడ్డోడు 776 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు సాధించిన వైభవ్.. ఐపీఎల్ అత్యంత విలువైన ఆటగాడిగా కూడా ఎంపికయ్యాడు.
సూర్య మళ్లీ తన ఫామ్‌ను అందుకుంటాడా?:
ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తే.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యంత పిన్న వయస్కుడైన భారత ఆటగాడి రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. 1989లో పాకిస్థాన్‌పై 16 సంవత్సరాల 205 రోజుల వయసులో సచిన్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
ఇక కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్న శ్రేయాస్ అయయర్ ముందున్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. అదే సమయంలో జట్టుకు దూరమైన సూర్య మళ్లీ తన ఫామ్‌ను అందుకుని భారత జట్టులోకి పునరాగమనం చేస్తాడా అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.




