Suryakumar Yadav : సూర్యకుమార్‎కు ఊహించని షాక్.. టీ20 కెప్టెన్సీ ఊడింది.. ఇక జట్టులో చోటు కూడా కష్టమేనా?

Suryakumar Yadav : భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు పెద్ద షాక్ తగిలింది. వరుస వైఫల్యాల కారణంగా ఆయనను కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా, జట్టు సెలక్షన్‌కు కూడా దూరం పెట్టనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

CR Reddy
Published on: 4 Jun 2026 6:45 AM IST
Suryakumar Yadav
X

Suryakumar Yadav 

Suryakumar Yadav : భారత టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఊహించని గట్టి దెబ్బ తగిలింది. అతని సారథ్యంలో టీమిండియా ఇటీవలే టీ20 వరల్డ్ కప్ 2026 గెలుచుకున్నప్పటికీ, మేనేజ్‌మెంట్ అతనిపై కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం, సూర్యకుమార్ యాదవ్‌ను భారత టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించారు. అంతటితో ఆగకుండా, భవిష్యత్తులో జరగబోయే సిరీస్‌ల కోసం అతడిని కనీసం జట్టు ఎంపికలోకి కూడా పరిగణించకూడదని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ దాదాపు ముగిసిపోయిందనే ప్రచారం జరుగుతోంది.

కెప్టెన్‌గా తిరుగులేని రికార్డు.. కానీ బ్యాటర్‌గా ఫ్లాప్

2024లో రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్ అయ్యాడు. అప్పట్లో నంబర్ 1 టీ20 బ్యాటర్‌గా ఉన్న సూర్యకు, హార్దిక్ పాండ్యాను పక్కనబెట్టి మరీ బీసీసీఐ పగ్గాలు అప్పగించింది. కెప్టెన్‌గా సూర్య అద్భుతాలు చేశాడు. అతని నాయకత్వంలో భారత్ వరుసగా 8 టీ20 సిరీస్‌లు గెలవడంతో పాటు, 2025 ఆసియా కప్, ఆపై 2026 టీ20 వరల్డ్ కప్ సాధించి చరిత్ర సృష్టించింది. అయితే కెప్టెన్‌గా జట్టు గెలుస్తున్నా, ఒక బ్యాటర్‌గా సూర్య తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. గత ఏడాది కాలంగా అతను ఘోరమైన బ్యాటింగ్ ఫామ్‌తో సతమతమవుతున్నాడు.

సూర్యపై వేటు వేయడానికి గల ప్రధాన కారణాలు

జట్టును విజయపథంలో నడిపించినప్పటికీ, సూర్య వ్యక్తిగత స్కోర్లు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. 2024లో 26.81 సగటుతో 429 పరుగులు చేసిన సూర్య, 2025 వచ్చేసరికి 19 ఇన్నింగ్స్‌లలో కేవలం 13.6 సగటుతో 218 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2026లో సగటు 44కి చేరినప్పటికీ, కీలకమైన టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో మాత్రం అతను ఘోరంగా విఫలమయ్యాడు. దీనికి తోడు ఐపీఎల్‌లో కూడా సూర్య బ్యాట్ ఊహించినంతగా ఝులిపించలేదు. దీంతో జట్టులో కేవలం కెప్టెన్సీ కోటాలో ఒక ఆటగాడిని కొనసాగించడం సరికాదని భావించిన బీసీసీఐ, ఈ కఠినమైన నిర్ణయానికి మొగ్గు చూపింది.

కొత్త కెప్టెన్ రేసులో శ్రేయస్ అయ్యర్, రజత్ పాటిదార్

సూర్యకుమార్ యాదవ్‌ను తప్పిస్తే టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పేరు బలంగా వినిపిస్తోంది. అయ్యర్ మళ్లీ టీ20 జట్టులోకి పునరాగమనం చేసి, నేరుగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. లీడర్‌గా శ్రేయస్‌కు మంచి అనుభవం , రికార్డు ఉన్నాయి. మరోవైపు, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును వరుసగా రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన రజత్ పాటిదార్ పేరు కూడా సెలక్టర్ల పరిశీలనలో ఉంది. పాటిదార్ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతుండటంతో టీమిండియా కొత్త బాస్ ఎవరనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story