SRH vs PBKS Record: ఉప్పల్ అంటేనే ఊగిపోతున్న ఎస్‌ఆర్‌హెచ్.. పంజాబ్‌కు ప్రతిసారీ దబిడిదిబిడే!
SRH dominance PBKS at Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లలో ఎస్‌ఆర్‌హెచ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
SRH vs PBKS Record: ఉప్పల్ అంటేనే ఊగిపోతున్న ఎస్‌ఆర్‌హెచ్.. పంజాబ్‌కు ప్రతిసారీ దబిడిదిబిడే!
SRH vs PBKS Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రతి ప్రాంచైజీకి హోమ్ గ్రౌండ్ ఉంటుంది. సొంత మైదానం అడ్వాంటేజ్ ప్రతి జట్టుకు కలిసొస్తుంటుంది. తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)కు అయితే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం కంచుకోట అనే చెప్పాలి. ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లలో ఎస్‌ఆర్‌హెచ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. 2013 నుంచి 2026 వరకు హైదరాబాద్ వేదికగా ఈ రెండు జట్లు మొత్తం 11 సార్లు తలపడగా.. సన్‌రైజర్స్ ఏకంగా 10 విజయాలు నమోదు చేసింది. మరోవైపు పంజాబ్ జట్టుకు ఒక్క విజయం మాత్రమే దక్కింది. 2015 నుంచి పంజాబ్‌పై హైదరాబాద్‌కు ఓటమే లేదు.
2013లో డెక్కన్ ఛార్జర్స్ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఏడాది జరిగిన తొలి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే 2014లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో గెలిచి హైదరాబాద్‌లో ఏకైక విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది. 2015 నుంచి వరుసగా సన్‌రైజర్స్ ఆధిపత్యం కొనసాగుతోంది.
2015లో 5 పరుగుల తేడాతో గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్.. 2016లో 5 వికెట్లతో విజయం సాధించింది. 2017లో మరోసారి 5 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. 2018లో 13 పరుగులు, 2019లో 45 పరుగుల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లు తటస్థ వేదికలు, లిమిటెడ్ స్టేడియాల్లో జరగడంతో ఉప్పల్ మైదానంలో హైదరాబాద్, పంజాబ్ తలపడలేదు. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత 2023లో ఈ రెండు జట్లు మళ్లీ ఉప్పల్‌లో తలపడగా.. ఎస్‌ఆర్‌హెచ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. 2024లో 4 వికెట్ల తేడాతో గెలిచిన హైదరాబాద్.. 2025లో మరోసారి 8 వికెట్లతో ఆధిపత్యం చాటింది.
ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా పంజాబ్‌కు నిరాశ తప్పలేదు. ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 33 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తమ విజయ పరంపరను కొనసాగించింది. ఈ విజయంతో హైదరాబాద్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. హైదరాబాద్‌లో పంజాబ్‌పై ఎస్‌ఆర్‌హెచ్ రికార్డు ఇప్పుడు ప్రత్యర్థి జట్లకు ఓ హెచ్చరికలా మారింది. సొంత మైదానం ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ను ఓడించడం ఎంత కష్టమో ఈ గణాంకాలే చెబుతున్నాయి.




