SRH vs RR: భయం లేదంటున్న కమిన్స్.. పూర్తిగా ఫిట్‌గా లేనన్న పరాగ్.. క్వాలిఫయర్-2కు వెళ్లేదెవరు?

SRH vs RR: ఐపీఎల్ 2026లో ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

Rishvik
Published on: 27 May 2026 7:35 PM IST
SRH vs RR
X

SRH vs RR: భయం లేదంటున్న కమిన్స్.. పూర్తిగా ఫిట్‌గా లేనన్న పరాగ్.. క్వాలిఫయర్-2కు వెళ్లేదెవరు?

SRH vs RR: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు మరికొన్ని క్షణాల్లో తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధించనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

టాస్ అనంతరం మాట్లాడిన ప్యాట్ కమిన్స్.. ‘మేము మొదట బౌలింగ్ చేయబోతున్నాము. గతంలో ఫైనల్స్ ఆడిన అనుభవం సహాయపడుతుందా? అంటే కచ్చితంగా తెలియదు. బహుశా కొన్ని ఫైనల్స్ ఆడి ఉంటే.. కొంచెం రిలాక్స్‌గా ఉండేవాళ్లం. ఇటీవల మేము మంచి క్రికెట్ ఆడుతున్నాం. బౌలింగ్‌లో సింపుల్‌ ప్రణాళికలు అమలు చేస్తాం. ఒకరిద్దరు ఆటగాళ్ల విషయంలో మంచి ప్రణాళికలు అసవరం. మా బలాల ప్రకారం ఆడాలని భావిస్తున్నాం. ఒత్తిడిపై మేము ఎక్కువగా ఆలోచించడం లేదు. జట్టులో ప్రఫుల్ హింగే తిరిగి వచ్చాడు. మొదట బ్యాటింగ్ చేయడం గురించి పెద్దగా ఆలోచించలేదు. మేము మొదట బ్యాటింగ్ చేసి చాలా మ్యాచ్‌లు గెలిచాము. ఇది ఛేజింగ్‌కు మంచి వేదికగా కనిపిస్తోంది. నిజాయితీగా చెప్పాలంటే ఒకవేళ మేము టాస్ ఓడిపోయి ఉన్నా పెద్దగా తేడా ఉండేది కాదు. ఎలాంటి భయం లేకుండా ఆడుతాం' అని చెప్పాడు.

మరోవైపు టాస్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. తాము టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమని చెప్పాడు. ‘ఈ మైదానంలో ఛేజ్ చేయడం సులభంగా ఉంటుంది. మేము ఇక్కడ ఛేజ్ చేసి కూడా గెలిచాం, స్కోర్ డిఫెండ్ చేసి కూడా విజయం సాధించాం. ప్రస్తుతం నేను పూర్తిగా ఫిట్‌గా లేను. అయినప్పటికీ ఇప్పుడు మాకు గెలవడం తప్ప మరో మార్గం లేదు. మా జట్టు తమ సామర్థ్యానికి తగ్గట్టు ఆడితే మంచి ఫలితం వస్తుంది’ అని పేర్కొన్నాడు. రాజస్థాన్ జట్టులో రవీంద్ర జడేజా తిరిగి చోటు దక్కించుకోగా.. దుబే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండనున్నాడు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్‌లపై ఆర్ఆర్ భారీ ఆశలు పెట్టుకుంది. ఎస్ఆర్‌హెచ్ తరఫున అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ కీలకంగా మారనున్నారు.

ఇప్పటికే ఈ సీజన్‌లో రాజస్థాన్‌పై రెండు విజయాలు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎలిమినేటర్‌లో కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది. అయితే వైభవ్ సూర్యవంశీ దూకుడు, ఆర్చర్ బౌలింగ్ రాజస్థాన్‌కు ప్రధాన బలాలుగా ఉన్నాయి. మరోవైపు కమిన్స్ సారథ్యంలో ఎస్ఆర్‌హెచ్ దూకుడైన క్రికెట్ ఆడుతూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతోంది. ఇరు జట్ల కెప్టెన్స్ మాత్రం విజయంపై ధీమాగా ఉన్నారు. చూడాలి మరి ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో.

తుది జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, స్మరణ్ రవిచంద్రన్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే.

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, దసున్ షనాకా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బృజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story