SRH vs LSG: తడబడి నిలబడిన ఎస్‌ఆర్‌హెచ్.. ఎల్ఎస్‌జీ టార్గెట్ ఎంతంటే?

SRH vs LSG IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్), ఎల్ఎస్‌జీ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 రన్స్ చేసింది.

Rishvik
Published on: 5 April 2026 7:38 PM IST
SRH vs LSG IPL 2026: Klaasen, Nitish Reddy Rescue Hyderabad to 156, Set 157 Target
X

SRH vs LSG IPL 2026

SRH vs LSG IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), లక్నో సూపర్‌ జెయింట్స్‌ (ఎల్ఎస్‌జీ) మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 రన్స్ చేసింది. దాంతో ఎల్ఎస్‌జీ ముందు 157 పరుగుల టార్గెట్ ఉంది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్‌ (62), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (56) హాఫ్ సెంచరీలు బాదారు. మిగతా బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. ఎల్ఎస్‌జీ బౌలర్లలో మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, అవేశ్ ఖాన్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే వరుస షాకులు తగిలాయి. తొలి ఓవర్లోనే వికెట్‌ కోల్పోయింది. షమీ వేసిన తొలి ఓవర్‌ చివరి బంతిని అభిషేక్‌ శర్మ (0) ఫ్లిప్‌ చేశాడు. బ్యాట్‌ ఔట్‌ సైడ్‌ ఎడ్జ్‌ను తాకి బంతి గాల్లోకి లేవగా.. సిద్ధార్థ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. షమీ రెండో ఓవర్లో ట్రావిస్‌ హెడ్ (7) అవుట్ చేశాడు. ప్రిన్స్‌ యాదవ్‌ వేసిన 3.3వ బంతికి ఇషాన్‌ కిషన్‌ (1) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. పవర్ ప్లే ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ మూడు వికెట్స్ కోల్పోయి 22 రన్స్ చేసింది. దిగ్వేశ్‌ రాఠి వేసిన 8వ ఓవర్ తొలి బంతికి లివింగ్‌స్టన్‌ (14) పెవిలియన్ చేరడంతో సన్‌రైజర్స్‌ పీకల్లోతు కష్టాలో పడింది. 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 35 పరుగులు మాత్రమే చేసింది.

11వ ఓవర్ నుంచి హెన్రిచ్ క్లాసెన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి గేర్ మార్చారు. వరుస ఫోర్లు, సిక్సులు బాదుతూ సన్‌రైజర్స్‌ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దాంతో 15 ఓవర్లకు స్కోరు 114/4గా నిలిచింది. ధాటిగా ఆడిన క్లాసెన్‌ 33 బంతుల్లో అర్ధ శతకం చేశాడు. మరోవైపు 30 బంతుల్లో నితీశ్‌ హాఫ్‌ సెంచరీ చేశాడు. 18వ ఓవర్లో నితీశ్‌ అవుట్ అవ్వడంతో సన్‌రైజర్స్‌ ఇనింగ్స్ మరలా గాడి తప్పింది. 19వ ఓవర్ మొదటి బంతికి క్లాసెన్‌ కూడా అవుట్ అయ్యాడు. హర్ష్‌ దూబె, శివాంగ్‌ కుమార్‌, అనికేత్ వర్మ, హర్షల్ పటేల్ విఫలమయ్యారు. 10 ఓవర్లకు 35 రన్స్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్.. మిగతా 10 ఓవర్లలో 156కు చేరుకుంది. అంటే సన్‌రైజర్స్‌ ముందుగా తడబడి.. ఆపై నిలబడింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story